ఇంటర్నేషనల్ డెస్క్- చలికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లడంతో మంచు ప్రదేశాల్లోని జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాద ఘటన జరిగింది. జనం పెద్ద ఎత్తున ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోవడం, భారీగా మంచు కురుస్తండటంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు.
ఇస్లామాబాద్ కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ సహా ఆయన కుటుంబంలోని 8 మందితో పాటు మొత్తం 22 మంది వాహనాల్లోనే చలికి గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగడుగుల మేర కురిసిన మంచులో వెయ్యి వరకు వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టింది.
ఆదివారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ముర్రీకి వెళ్లే రహదారులను ముందు జాగ్రత్తగా ఆదివారం సాయంత్రం వరకు మూసివేసినట్లు అధికారులు చెప్పారు.