దేశంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చినప్పటికీ.. అవి గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. నగరాలతో పోలిస్తే గ్రామీణాల్లో చాలా ఎక్కువ. వరకట్నం ఇవ్వలేని లేదా అమ్మాయి పోషించే స్థోమత లేని వాళ్లు , అక్షరాస్యత లేని తల్లిదండ్రులు, తమ అమ్మాయిలకు పెళ్లి ఈడు వచ్చేంత వరకు వేచి ఉండటం లేదు. దీంతో లోకం తెలియని ఆడ పిల్లల్ని, పెళ్లి పేరుతో వదిలించుకుంటున్నారు. ఇదే అస్సాం రాష్ట్రాన్నిపట్టి పీడిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారంటే.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తోంది.
మైనర్లను పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తినైనా వదిలిపెట్టబోమని, కటకటాల వెనక్కు పంపిస్తామని ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టిగా చెప్పారు. 14 ఏళ్ల లోపు అమ్మాయిలతో లైంగిక సంబంధం నేరమేనన్న ఆయన.. మరో ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు జైలు కెళ్లడం ఖాయమని చెప్పారు. చట్టపరంగా 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలు మాత్రమే పెళ్లి చేసుకునేందుకు అర్హులని, మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెప్పి వారం రోజులు కూడా గడవకముందే ప్రక్షాళన చర్యలు చేపట్టారు. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిపై చర్యలు మొదలయ్యాయి. గత వారంలోనే బాల్య వివాహాలకు సంబంధించి రాష్ట్రంలో 4004 కేసులు నమోదయ్యాయి.
శనివారం వరకు 2170 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. వీరిలో 52 మంది పూజారులు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో బాల్య వివాహాలను అంతం చేసేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, ఇప్పటి వరకు 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అస్సాం సిఎం తెలిపారు. రాబోయే రోజుల్లో బాల్య వివాహాలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. బాల్య వివాహాల అణచివేతకు అస్సాం సిఎం తీసుకుంటున్ననిర్ణయం అభినందనీయం. మైనర్లను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తులను అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.