టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు పొమ్మనలేక పొగబెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో సీనియర్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం.
చాన్నాళ్లుగా టీ20 క్రికెట్‌కు దూరంగా ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు.. ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ వరుసలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాదే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టీ20ల్లో యువకులుకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. ఇక వారికే పట్టం కట్టడం పక్కా కావడంతో సీనియర్ ఆటగాళ్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అశ్విన్, భువీ.. గత నవంబర్ తర్వాత భారత జాతీయ జట్టు తరఫున టీ20ల్లో ఆడలేదు. దీంతో త్వరలో ఐర్లాండ్‌తో జట్టు ప్రకటన అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు టాటా చెప్పనున్నట్లు సమాచారం.
2010లో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన చెన్నై కుర్రాడు రవిచంద్రన్ అశ్విన్.. తన ఆఫ్ స్పిన్‌తో జట్టుకు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావించిన బోర్డు.. నాలుగైదేండ్లుగా టీ20లకు అశ్విన్ పేరును పెద్దగా పరిగణించలేదు. అయితే టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడైన ఈ ఆల్‌రౌండర్.. తన ప్రతిభతో తిరిగి టీ20ల్లో అడుగుపెట్టాడు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పొట్టి క్రికెట్‌లో సంప్రదాయ స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతుండగా.. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అశ్విన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 65 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన అశ్విన్.. 72 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి.. కొత్త కుర్రాళ్లు మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ దూసుకురావడంతో భువనేశ్వర్ జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తన స్వింగ్ బౌలింగ్‌తో సత్తాచాటిన భువీ.. ఆ జోరు కనబర్చలేకపోవడంతో సెలెక్టర్లు టీ20లకు భువీని పరిగణనలోకి తీసుకోవడమే మానేశారు. దీంతో ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టుల్లోనూ భువనేశ్వర్ కు చోటు దక్కలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 87 మ్యాచ్‌లాడిన భువీ.. 90 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విండీస్‌తో పొట్టి సిరీస్ కోసం ఇప్పటికే యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తూ జట్టును ప్రకటించగా.. ఐర్లాండ్‌తో కూడా వీరికే పెద్ద పీట వేసే అవకాశాలున్నాయి. దీంతో ఇక తమకు తిరిగి జట్టులో చోటు దక్కడం కష్టమే అని భావిస్తున్న అశ్విన్, భువీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు పలికే ఆలోచనలో ఉన్నారు.