హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రావారం రాత్రి కేబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఒక్క సారిగా బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ముందు మెడికవర్ ఆస్పత్రికి, ఆతరువాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శనివారం ఉదయం వరకు సాయి ధరమ్ తేజ్ కు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయనకు ప్రణాపాయం ఏంలేదని, ఐతే 48 గంటలు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని చెప్పారు. దీంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందారు. ఐతే సాయి ధరమ్ తేజ్ కు ప్రాణాపాయం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆపోలో ఆసుపత్రి బృందం తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఆయన ప్రధాన అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని అపోలో వైద్యుల బృందం ప్రకటించింది. సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతానికైతే ఐసీయూ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటికే కొన్ని వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, శనివారం రాత్రి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశారు. అన్ని వైద్య పరీక్షల అనంతరం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఆదివారం ఉదయం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేయనుంది అపోలో ఆస్పత్రి వైద్య బృందం.