హైదరాబాద్ నగరంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిందే. నగరంలో కూడా భూమి లభ్యత తక్కవ కావడం, జనాభా పెరగడం, నివాసం అవసరంగా మారడంతో చిన్న స్థలంలోనే బహుళ అంతస్థులు కట్టేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు.
ఇల్లే కదా స్వర్గ సీమ. సొంత గూడు ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ కొందరు మాతమ్రే తమ కలలను సాకారం చేసుకుంటుంటారు. భూమి ధరలు పెరగడంతో పాటు ఇంటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ కావడమే ఇందుకు కారణం. సామాన్యుడికి ఈ రెండూ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే అపార్ట్ మెంట్ కల్చర్ వైపు చూస్తున్నారు. అయితే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫ్లాట్ ధరలు కొండనెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిందే. నగరంలో కూడా భూమి లభ్యత తక్కవ కావడం, జనాభా పెరగడం, నివాసం అవసరంగా మారడంతో చిన్న స్థలంలోనే బహుళ అంతస్థులు కట్టేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు.
అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం సామాన్యులకు వరంగా మారే అవకాశాలున్నాయి. 1998లో అమలులో ఉన్న జీవో నెం 111ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ శివారున ఉన్న 84 గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ఈ ప్రాంతాన్ని అభిృద్ధి చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. ఈ జీవో రద్దుతో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్, గండి పేటలో పరిధిలోకి వస్తున్న ఈ గ్రామాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోతో ఇప్పటి వరకు ఈ ప్రాంతమంతా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు దీనికి మహార్థశ రానుంది. దీంతో హైదరాబాద్ నగరం లాగే.. మరో మహా నగరం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే నగర ప్రజలకు ట్రాఫిక్ ఇతర సమస్యల నుండి కొంత ఊరట లభించవచ్చు.
ఈ జీవో రద్దు తక్కువ బడ్జెట్‌లో భూమి, ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారికి సదావకాశమేనని చెప్పవచ్చు. అంతేకాకుండా నగరంలో కూడా ఫ్లాట్స్ రేట్లు కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదు. నగర జనాభా పెరుగుదల నేపథ్యంలో.. డిమాండుకు తగ్గట్లుగా ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నఆలోచనను తీసేస్తున్నారు సామాన్యులు. ఇప్పుడు మరో మహా నగరం ఏర్పడితే.. హైదరాబాద్‌లో ఫ్లాట్ ధరలు దిగి వస్తాయి. అలాగే నగరంలో ఫ్లాట్ తీసుకోలేని వారు.. అక్కడ పెట్టే ధరతో.. ఇక్కడ తమ ఆలోచనలకు తగ్గట్లుగా ఇల్లు నిర్మించుకుంటారు. అంతేకాకుండా నగరం పెరిగితే.. వ్యాపార, వాణిజ్య, నివాస సముదాయాలు ఏర్పడి.. జనాభా పెరుగుతుంటూంది. మరో మహానగరం నిర్మించేంత భూమి అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ రూపు రేఖలు మారిపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.