సాధారణంగా మనుషులు తమ జీవిత చివరి దశవరకు వరకు ఆస్తిపాస్తుల కోసం పోరాడుతుంటారు. ఎక్కడ విశ్రాంతి తీసుకోరు.. ఎవరికి దాన ధర్మాలు చేయరు. ఎవరో కొందరు మాత్రమే తాము కూడబెట్టిన సంపాదనలో కొంత సొమ్మును పెద్దమనసుతో దానం చేస్తుంటారు. ఆ కోవలోకి చెందిన మహిళే ఈ వృద్ధురాలు. గ్రామంలో ఆసుపత్రి నిర్మిస్తే పేదలందరికీ ఉపయోగకరమని భావించారా ఆ వృద్ధురాలు. పేదల ఆరోగ్యం కోసం కోట్ల విలువైన భూమి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా వెలివెన్ను గ్రామానికి 10 పడకల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామంలో అన్నీ ఖరీదైన భూములు కావడంతో స్థలసేకరణ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఆ గ్రామానికే చెందిన దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మకు ఆ విషయం తెలిసింది.
76 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో ఉన్న సీతమ్మ వెంటనే స్పందించారు. తాను స్థలం ఇస్తానంటూ ముందుకొచ్చారు. తనకున్న ఏడు ఎకరాల్లో రూ. 3 కోట్ల విలువైన ఓ ఎకరా భూమిని విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయించి స్థానిక జడ్పీటీసీ సభ్యుడికి ఇచ్చింది. తమ దంపతుల పేరుతో ఆసుపత్రి నిర్మించి పేదలకు వైద్యసేవలు అందించాలని సీతమ్మ కోరారు. వృద్ధాప్యంలోనూ గ్రామ బాగుకోసం ఆమె చూపిన చోరవ ఎందరికో ఆదర్శం. 76 ఏళ్ల ఈ వృద్ధురాలు చేసిన ఈ మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.