అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ బోర్డ్, పదవ తరగతి మార్కులకు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70 శాతం వెయిటేజీతో సెకండ్ ఇయర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లు కేటాయించారు.
ఈనెల 31 లోపు ఇంటర్ ఫలితాను వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా కనీసం 35 మార్కులు ఇచ్చామని ఆయన చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5 లక్షల 8 వేల 672 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో బాలురు 2 లక్షల 53 వేల138 మంది, బాలికలు 2 లక్షల 55 వేల534 మంది ఉన్నారని మంత్రి తెలిపారు.
ఇప్పుడు వీరంతా ఉత్తీర్ణులయ్యారని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై సంతృప్తి చెందకుండా, పరీక్షలు రాయాలనుకునే విధ్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఏపీ ఇంటర్ సెకండ్ ఇటర్ పరీక్ష ఫలితాలను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in వెబ్ సైట్లలో పొందవచ్చని అధికారులు తెలిపారు.