న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబందించిన పలు పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రాష్ట్ర విభజన ఏపీ ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీ దగ్గర ఆవేధన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, రెవెన్యూ కేవలం 45 శాతం మాత్రమే దక్కిందని ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయిందని, తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలన్నీ కోల్పోయినట్లు సీఎం జగన్, ప్రధానికి గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు ఇచ్చారని, వీటిని అమలు చేస్తే చాలా వరకు రాష్ట్రానికి ఊరట లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగిందని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఏప్రిల్ 1 అంచనాల మేరకే పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిందని గుర్తు చేశారు.
ఐతే 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని ప్రధానికి వివరించారు. 2017- 18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లుగా నిర్ణయించాలని మఖ్యమంత్రి కోరారు. ఇదే సమయంలో పోలవరం నిర్మాణంపై 2,100 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని, ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న18,830.87 కోట్లు చెల్లించాలని సీఎం జగన్, ప్రధాని మోదీకి విన్నవించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గారితో సీఎం జగన్ గారి భేటీ
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం.
ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించిన ముఖ్యమంత్రి #YSJaganinDelhi #CMYSJaganMeetsPM pic.twitter.com/uzUSzRti9h
— 2024YSRCP (@2024YSRCP) January 3, 2022