అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాల్లో దూసుకుపోతోంది. అనేక రకాల సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ప్రజల ఆర్ధిక అభివృద్దికి తోడ్పాటు అందిస్తోంది ఏపీ సర్కార్. ఈ మేరకు మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాడు అందించేందుకు మరో 14 కార్పోరేట్ సంస్థలు, ఎన్‌జీవోలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రంగం సిద్దమైంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా మహిళలకు నగదు బదిలీ చేసి వ్యాపారాల్లో పెట్టబడికి వినియోగించే అవకాశం కల్పించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పధకం ద్వారా సంవత్సరానికి కనీసం 6లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని సర్కార్ లక్ష్యాంగా పెట్టుకుంది. చేతి వృత్తుల ద్వారా మహిళలు తయారుచేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమేడ్ దుస్తులను విక్రయించడానికి ఈ కామర్స్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. మరోవైపు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, వసతుల కల్పన ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో లాభదాయకత పెంచడం వంటి చర్యలపైనా జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది.
అజియో బిజినెస్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వార సుమారు 90 వేల మంది మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అంతే కాదు ఎన్ఐ ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు హెల్ప్ చేస్తున్నారు.