రాజకీయ నాయకులు మీడియా సంస్థలపై మండిపడుతుండటం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో బాహాటంగానే వారి వ్యతిరేకతను వెల్లిబుచ్చుతుంటారు. అలాంటి ఘటనే సీఎం వైఎస్ జగన్ సమీక్షలోనూ చోటుచేసుకుంది. అలా జరగడం ఇది మొదటిసారేం కాదు. తాజాగా జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో జరుగుతున్న సమీక్షలో సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు మీడియా సంస్థలతో జాగ్రత్త అంటూ అధికారులను హెచ్చరించారు.
‘రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ ఎంత బాగా స్పందించినా.. లోపాయకారి ఉద్ధేశంతో బురద జల్లాలని వ్యతిరేక ప్రచారం చేసే వ్యవస్థని కూడా చూస్తాఉన్నాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఉదాహరణకు ఒక చిన్న ఈవ్‌టీజింగ్ కేసులో ఏమీ లేకపోయినా బూతద్దంలో చూపించారన్నారు. ఆ ఘటనలో కానిస్టేబుల్‌ని సస్పెండ్ కూడా చేశామని గుర్తుచేశారు. వారి వారి స్వలాభం కోసం ఆడపిల్లల కుటుంబాల గౌరవాన్ని బజారున పెడుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అధికారులు, ప్రత్యేకంగా కలెక్టర్లు, ఎస్పీలు నిశితంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘మీరు రాజకీయ నాయకులతో కాదు, రాజకీయ పార్టీలతో కాదు.. స్వలాభం కోసం పాటుపడుతున్న కొన్ని మీడియా సంస్థలతో పోరాడుతున్నారు’ అంటూ అధికారులను హెచ్చరించారు. ‘వారు కోరుకున్న వ్యక్తిని సీఎంని చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ఎవరిపై బురద జల్లడానికైనా సిద్ధమైపోతాయి. కలెక్టర్లు, ఎస్పీలు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సీఎం జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఎంత మంచి జరుగుతున్నా వారికి కనిపించదని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఎంత చిన్న సంఘటనైనా వెంటనే స్పందించండి. ఆ ఘటనను వక్రీకరించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకండి’ అంటూ సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.