ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. తాజాగా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతే కాదు అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
ఇక విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఇది చదవండి : రాష్ట్రంలో రేపటి నుంచి ఫీవర్ సర్వే..!
విమానాశ్రయంలో రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టి, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.