అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, గుట్కాను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై మంగళవారం నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపైనా ఏపీ సర్కార్ నిషధం విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు.
పాన్ మసాలా, గుట్కా, తంబాకు లాంటి వాటిని దేశంలోని చాలా రాష్ట్రాలు నిషేదించాయి. గుట్కా, నమిలే పొగాకు వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ప్రభుత్వాలు వాటిని బ్యాన్ చేస్తున్నాయి. అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో గుట్కా, పాన్ మసాలా ను స్మగ్లింగ్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. దీంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి, అక్రమంగా రవాణా చేసేవారిని అరెస్ట్ చేస్తున్నారు.
మరోవైపు గుట్కా, పాన్ మసాలా కంపెనీలను, వాటి బ్రాండ్స్ ను చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నారు. ఈ మేరకు టీవీల్లో, న్యూస్ పేపర్ లోని ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఇలా గుట్కా, పాన్ మసాలా ప్రకటనల్లో నటించే ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తడంతో అమితాబ్ బచ్చన్ తో సహా చాలా మంది వెనక్కి తగ్గారు.