కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తీవ్రత తగ్గడంతో ఏపీలో పాఠశాలలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను నిర్వహించాలని విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. పాఠశాలల పనివేళలు పెంచడంతో పాటు, పండుగ సెలవులను కూడా ప్రభుత్వం తగ్గించింది. గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పని వేళలకు అదనంగా విద్యాశాఖ ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచింది.
మామూలుగా ఈ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటికే రెండు నెలల సమయం వృథా కావడంతో ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం సెలవులను కుదించింది. ఈ మేరకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. పాఠశాలలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు ఉదయం 9 :05 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పనిచేస్తాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేస్తాయి.
దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 16 వరకు, దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్ – మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుంచి 30 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు, ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇవ్వనుంది. స్కూల్ బస్ లో సగం మంది పిల్లలకే అనుమతి. రిక్షాలో పాఠశాలకు రాకూడదు. తల్లిదండ్రులు పిల్లలను వ్యక్తిగతంగా తీసుకు వచ్చి తిరిగి తీసుకెళ్లాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారితో కలసి ఉండే పిల్లలకు పాఠశాలలో నో ఎంట్రీ. ఉదయం పూట అసెంబ్లీ సాయంత్రం పూట ఆటలు ఇక ఉండవు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స్కూళ్లు పనిచేయాలన్న సర్కార్ నిర్ణయంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ సర్కార్ విద్యాహక్కు చట్టంతో పాటు తాజాగా అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానం ప్రకారం రాష్ట్రంలోని స్కూళ్లలో సంస్కరణలు చేపడుతోంది. స్కూళ్లతో పాటు విద్యార్ధుల ఆలోచనా విధానం కూడా మారాలనేది ప్రభుత్వ ఉద్దేశం.