విశాఖపట్నం- ఇప్పటికే అకాల వర్షాలతో అతలాకుతరం అయిన ఆంధ్రప్రదేశ్ ను మరో తుఫాను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు తుఫాను సిద్దంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుఫాన్ గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. దీనికి సౌదీ అరేబియా సూచన మేరకు జవాద్ అనే పేరు పెట్టారు.
ఈ తుఫాన్ ప్రస్తుతం గంటకు 22 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నానికి విశాఖపట్నానికి 300 కిలో మీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా, గోపాల్‌పూర్ కు 420 కిలో మీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. జవాద్ తుఫాను వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి తీవ్ర తుఫాన్ గా బలపడింది. విశాఖపట్నానికి 100 నుంచి 150 కిలో మీటర్ల సమీపానికి వచ్చేస్తోంది. అక్కడ నుంచి కొన్ని గంటలు పయనించి ఉత్తర వాయవ్యంగా ఒడిసా వైపు వెళ్లనుంది.
ఈ తుఫాను శనివారం అర్ధరాత్రి సమయంలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా లేదా వాయుగుండంగా మారి ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా సోంపేట, ఒడిసాలోని పూరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాక అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో శనివారం తెల్లవారుజామున గాలుల ఉధృతి గంటకు 80 నుంచి 90, ఉదయం గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల. వేగంతో వీచాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా అసాధారణ వర్షాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాంలలో భారీ నుంచి అతి భారీ, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 4వ నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలలో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. జవాద్ తుఫాన్ నేపధ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యా సంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్రకు 11ఎన్డీఆర్‌ఎఫ్, 3 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు, మరో 4 బృందాలు అందుబాటులో ఉంచారు.