ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరుగా జైలుకి పంపిస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు తన సొంత పార్టీ ఎంపీకే షాక్ ఇచ్చింది. నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ కృష్ణరాజు వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సెక్షన్ ఏంటి? వారెంట్ ఎక్కడ అంటూ ఆయన సీఐడీ అధికారులను ప్రశ్నించారు.కానీ.., పోలీసులు మాత్రం తమతో సీఐడీ కార్యాలయానికి వస్తేనే అన్నీ వివరాలు వెల్లడిస్తామని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక రఘురామరాజుపై ఐపీసీ-124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే.., తన తండ్రి అరెస్ట్ పై కుమారుడు భరత్ ఘాటుగా స్పందించాడు. 35 మంది వ్యక్తులు మఫ్టీలో వచ్చి కనీసం వారెంట్ కూడా ఇవ్వకుండా తన తండ్రిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. తన తండ్రి గుండె సంబంధిత వ్యాధితో త బాధపడుతున్నారని, ఆయన్ని పుట్టిన రోజు నాడే కావాలని అరెస్ట్ చేశారని రఘురామ కృష్ణరాజు కుమారుడు ఆరోపించారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని, ఆయనకి ఏమైనా అయితే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలని భరత్ ఆరోపించారు.
వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన నటి నుండే రఘురామ కృష్ణరాజు పార్టీకి రెబల్ గా మారారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఆయన రోజు మీడియా ముందుకి వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక కరోనా నియంత్రణలో, వైద్య సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలైమైందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది అంటూ సంచలన ఆరోణలు చేశారు. అలాగే.., ఇసుక , మద్యం వంటి వాటిల్లో వైసీపీ నాయకులు ఎవరెవరు ఎంత దోచుకున్నారో నా దగ్గర లెక్క ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు కారణంగానే రఘురామ కృష్ణరాజు అరెస్ట్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అరెస్ట్ చేసింది నాన్ బెయిల్ బుల్ సెక్షన్ కావడంతో ఎంపీ ఇప్పట్లో బయటకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఎంపీకి రక్షణగా ఉన్న కేంద్ర బలగాలను దాటుకుని ఏపీ సీఐడీ ఎంపీని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి రానున్న కాలంలో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో? ఎంపీ రఘురామ భవితర్యం ఏమిటో చూడాలి.