సుమ.. పేరు వినగానే గలగలా పారే మాటల ప్రవాహం గుర్తుకు వస్తుంది. స్వచ్ఛమైన తెలుగులో.. గలగల మాట్లాడుతూ.. సమాయానుకూలంగా పంచ్‌లు వేస్తూ.. ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు యాంకర్ సుమ. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన సుమ.. తెలుగింటి కోడలు కావడమే కాక.. తెలుగులోనే స్టార్ యాంకర్‌గా రాణిస్తున్నారు. సుమతో పాటు యాంకర్‌గా వచ్చిన వారు ఎంతో మంది.. కెరీర్ ముగిసినప్పటికి.. సుమ మాత్రమే ఇంకా యాంకర్‌గా.. అది కూడా టాప్ యాంకర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా మాత్రమే కాక ప్రీరిలీజ్ ఈవెంట్స్, యూట్యూబ్ చానెల్ వంటి వాటితో ఇప్పటికి కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సుమ. ఈ క్రమంలో తాజాగా సుమ చేసిన ఓ మంచి పని గురించి తెలిసి నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
30 మంది పేద పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు సుమ. వారి చదువు పూర్తయ్యి.. జీవితాల్లో సెటిల్ అయ్యే వరకు.. వారి పూర్తి బాధ్యత తనదే అని తెలిపారు సుమ. తనను ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం తాను కూడా ఏదో ఒకటి చేసి వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు సుమ. అందుకే తన పరిధిలో ఓ నలుగురికి సాయపడాలని సంకల్పించినట్లు తెలిపారు. తాజాగా సుమ మద్రాస్ ఐఐటీ కాలేజీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు సుమ. ఈ క్రమంలోనే తాను తీసుకున్న నిర్ణయం గురించి వెల్లడించారు సుమ.
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ..‘‘నన్ను ఇష్టపడి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం నేను కూడా ఎంతో కొంత చేయాలి అనుకున్నా. లేదంటే లావయిపోతానేమో అని భయం వేసింది. అందుకే ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ అనే సంస్థను స్థాపించాను. ఇది నా కల. ఇన్నాళ్లకు నెరవేరింది. ఎందుకంటే నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు కొందరికైనా ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా నా వంతుగా 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని.. వారిని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు వారి పూర్తి బాధ్యత నాదే.. వారు జీవితంలో సెటిల్ అయ్యేవరకు నేను వాళ్ళతోనే ఉంటాను. అంతే కాదు ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్నారు.. వారితో పాటు జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు’’ అంటూ సుమ చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, యాంకరింగ్ కెరీర్ గురించి కూడా విద్యార్థులతో కొన్ని వివరాలు పంచుకున్నారు సుమ. యాంకర్‌గా తన కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యిందో ఈ సందర్భంగా చెపపుకొచ్చారు సుమ. ‘‘నేను పుట్టింది పాలక్కాడ్‌లో.. 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ తెలుగు నేర్చుకుని మాకు తెలుగు నేర్పి ఇక్కడికి పంపించింది. జీవితం అంటేనే పెద్ద సవాలు. చనిపోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది. నాకు పేరు రావాలి రావాలి అంటే రాదు.. ఏం చేయాలి అనుకుంటున్నామో అది కరెక్ట్‌గా చేసినప్పుడే మనకు పేరు వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. సుమ చేస్తున్న మంచి పనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి సుమ చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.