ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పపై భారీ అంచానాలు నెలకొన్నాయి. రంగస్థలం సినిమాతో భారీ హిట్ కొట్టిన సుకుమార్ ఓ వైపు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్ మరో వైపు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్పతో హ్యాట్రిక్ కొట్టడానికి తహతహలాడుతున్నారు.
డిసెంబర్ 17న రాబోతోన్న పుష్ప ది రైజ్ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేశాయి. ఇక పుష్ప మ్యూజికల్ ప్రమోషన్స్ మంచి ఊపు మీదున్నాయి. ఇదిగో ఈ సమయంలోట్రైలర్ తో సినిమాను జనాల్లోకి ఇంకా తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. పుష్ప ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా అంతకు ముందుగానే ఓ చిన్న శాంపిల్ ను రిలీజ్ చేశారు పుష్ప మేకర్స్. పుష్ప ట్రైలర్ టీజ్ పేరిట విడుదల చేసిన వీడియోలో పుష్ప రాజ్ ప్రపంచాన్ని చూపించారు. అంతే కాదు.. శ్రీవల్లి పాత్రలో రష్మిక మీద కూడా రెండు షాట్లు కనిపించాయి. ఇక దాక్షాయణి కారెక్టర్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ మీద షాట్ అదిరిపోయింది. మంగళ శీను కారెక్టర్ ను పోషిస్తున్న సునీల్ మీద అనసూయ తన కోపాన్ని ప్రదర్శించింది. తన నోట్ల బ్లేడు పెట్టుకుని చాలా కోపంగా కనిపించింది అనసూయ.
ఈ ట్రైలర్ టీజ్ చూస్తోంటే సునీల్ పాత్రను అనసూయ అంతం చేస్తున్నట్టే కనిపిస్తోంది. పుష్ప సినిమాలో అనసూయ సునీల్ భార్యగా నటించినట్లుగా తెలుస్తోంది. మరి అలాంటప్పుడు సునీల్ మీదకు ఎందుకు ఎక్కింది, ఎరుపెక్కిన కళ్లతో సునీల్ ను ఏం చేయబోతోంది, మంగళం శ్రీను పాత్రలో ఉన్న సునీల్ జీవితాన్ని అనసూయ ముగించబోతోందా.. మొత్తానికి దాక్షాయణిగా అనసూయ మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం డిసెంబర్ 17వరకు ఆగాల్సిందే.