అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ కు సవాలక్ష కారణాలు కన్పిస్తున్నాయి. ఆయన సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా చెస్తున్న ఆరోపణలు, గుప్పిస్తున్న విమర్శలు ఓ కారణమైతే.. జగన్ సర్కార్ పై రఘురామ కృష్ణరాజు వేస్తున్న కేసులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైంది అమూల్ డెయిరీ కేసు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవల్‌పమెంట్ ఫెడరేషన్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ కృష్ణరాజు సవాల్ చేశారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో రఘురామ కృష్ణరాజు పిటీషన్ దాఖలు చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదలాయింపునకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ లో కోర్టును కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఉద్యోగులను ప్రైవేట్ సంస్థ అయిన అమూల్ వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని రఘురామ కృష్ణరాజు కోర్టుకు విన్నవించారు. ఆంద్రప్రదేశ్ లోని పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ పిల్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్, ఏపీడీడీఎఫ్ ఎండీ, నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు ఛైర్మన్, అమూల్ ఎండీ, ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీని.. రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ఇలా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా రఘురామ కృష్ణరాజు కోర్టుల్లో కేసులు వేయడమే ఆయన అరెస్ట్ కు దారితీసిందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.