దేశంలో కరోనా కష్టాలు కొనసాగుతోన్నాయి. ఎప్పుడు, ఎవరి జీవితాలు తలకిందులు అవ్వుతాయో అర్ధం కావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడ చోద్యం చూస్తూ మిన్నుకుండి పోయే పరిస్థితిలు తలెత్తాయి. ఇలాంటి సమయంలో మనసున్న మహారాజులు ముందకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది నేరుగా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మనిషికి మనిషే తోడు అన్న సత్యాన్ని నిజం చేస్తూ.., మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కష్టాల్లో ఉన్న కుటుంబాలను పీడిస్తూ వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారు. అలాగే.., పక్క మనిషి కష్టాన్ని పట్టించుకోకుండా.., తమ స్వార్ధం చూసుకుంటున్న వారు ఉన్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., మునుకుళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని గత కొన్ని రోజులుగా జ్వరంతో భాదపడుతున్నాడు. దీనితో అతని భార్య తిరువూరులోని కోవిడ్ హాస్పిటల్ కు మెరుగైన వైద్యం కోసం భర్తని తీసుకెళ్లింది. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుభానిని అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలియచేశారు. దీనితో సుభాని భార్య అక్కడే కుప్పకూలి పోయింది. ఇక.. భర్త మృతదేహాన్ని 108లో ఎక్కించి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది. కానీ.., అంబులెన్సు సిబ్బంది ఏ మాత్రం మానవత్వం చూపకుండా సుభాని కరోనాతో చనిపోయాడంటూ మృతదేహాన్ని రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయారు. అయ్యా.., నేను ఒంటరి మహిళని, నా భర్త మృతదేహాన్ని ఇంటి వరకు చేర్చండి అని సుభాని భార్య ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. దీనితో మృతదేహం అలా రెండు గంటల పాటు రోడ్డు పైనే అనాథలా పడి ఉంది. భర్త మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ ఉండడాన్ని గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.అనంతరం పోలీస్ లు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషాద ఘటనని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. దీనితో నెటిజన్స్ ఆ ఆంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.