2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా బీసీసీఐ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే అనేక కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ.. టీమిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. అయితే కరోనా కాలంలో బయోబబుల్ లో ఉండటం కారణంగా ఆటగాళ్ల.. అలసటను దృష్టిలో పెట్టుకుని యో-యో టెస్ట్ ను రద్దు చేసింది. అయితే వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సామర్థ్యాన్ని, ఫిట్ నెస్ పై బీసీసీఐ కన్నేసింది. అందులో భాగంగానే యో-యో టెస్ట్ తో పాటుగా ‘డెక్సా’ అనే టెస్ట్ ను కూడా తెరపైకి తెచ్చింది బీసీసీఐ. దాంతో ఈ డెక్సా టెస్ట్ అంటే ఏంటి? దానిని ఎందుకు చేస్తారు అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ లో ఆటగాళ్లకు ఫిట్ నెస్ చాలా కీలకమైంది. గంటలు గంటలు గ్రౌండ్ లో పరిగెత్తాలంటే ఫిట్ నెస్ చాల ముఖ్యం. అందుకే ఆటగాళ్లను సెలెక్ట్ చేసే ముందు శారీరక సామర్థ్య పరీక్ష పెడతారు. అదే యో-యో టెస్ట్. టీమిండియా జట్టుకు ఆటగాళ్లు ఎంపిక కావాలి అంటే ఈ టెస్ట్ కచ్చితంగా పాస్ కావాలి. కానీ కరోనా కాలంలో యో-యో టెస్ట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి నుంచి టీమిండియా క్రికెటర్లు ఫిట్ నెస్ పై దృష్టిపెట్టడం తగ్గించారని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ.. వచ్చే ప్రపంచ కప్ కు జట్టుకు మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే యో-యో టెస్ట్ తో పాటుగా కొత్తగా ‘డెక్సా’ టెస్ట్ ను కూడా తీసుకోచ్చింది. దాంతో ఈ డెక్సా టెస్ట్ అంటే ఏంటి అని ఆటగాళ్లతో పాటుగా.. సగటు క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
డెక్సా టెస్ట్ అంటే ఏంటి?
సాధారణంగా క్రీడాకారుల ఫిట్ నెస్ ను అంచనా వేయాలి అంటే.. ఇంతకు ముందు యో-యో టెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు దానితోపాటుగా డెక్సా అనే మరో పరీక్షను కూడా కొత్తగా అమలులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. డెక్సా టెస్ట్ అంటే.. ఆటగాడి ఎముకల సామర్థ్యాన్ని కొలిచే ఒక ఇమేజింగ్ టెస్ట్. ఈ పరీక్షలో ఆటగాడి బాడీలోకి కిరణాలను పంపుతారు.. అవి ఆటగాడి ఎముకల్లో ఎంత సామర్థ్యం ఉంది, ఎక్కడైనా బోన్ క్రాక్స్ ఉన్నాయా? లేవా? అనే విషయాలను చాలా క్లియర్ గా వెల్లడిస్తాయి. అదీకాక బోన్స్ ఎంత గట్టిగా ఉన్నాయి, లేదా ఏదైనా సమస్య ఉందా అన్న విషయాలను ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆటగాళ్లు తరచుగా గాయాలపాలైతుండటంతోనే ఈ టెస్ట్ ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.