ప్రభుత్వం కొత్త బైక్ కొన్న వారికోసం ఓ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకురావటానికి చూస్తోంది. ఆ రూల్ పాటించని వారిని కఠినంగా శిక్షించాలని కూడా ప్రభుత్వం చూస్తోందట..
నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్ అయితే మరికొన్ని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల సంభవించేవి. నిర్లక్ష్యంగా జరిగే ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అందరు ఒక్క నిమిషం కూడా వేచి చూసే సమయం లేకపోవడంతో రోడ్లమీద దూసుకెళ్లడం పరిపాటి అయింది.
ఈ హడావుడిలో అనుకోని ప్రమాదాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు 53 శాతం జరుగుతున్నాయని అధ్యయనాల వల్ల తేలింది. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తేనుంది. ఆ రూల్స్ ప్రకారం.. ఎవరైనా కొత్త బైక్ కొనేటప్పుడే రెండు హెల్మెట్లు కొనాలి. ఈ ప్రతిపాదన ద్వారా రోడ్డు ప్రమాదాలు కొంతవరకు నివారించవచ్చని రాష్ట్ర పోలీసు శాఖ అభిప్రాయ పడుతోంది.
బైక్ నడిపేవారు, వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలట. దీనిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది. అయినా ప్రజల్లో అవగాహన పెంచి.. ఈ నిబంధన తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు హెల్మెట్ల నిబంధనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.