ఫిల్మ్ డెస్క్- దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా రొమాంటిక్. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు, స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు పూరి జగన్నాధ్. అక్టోబరు 29న రొమాంటిక్ విడుదలవుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రొమాంటిక్ ట్రైలర్ విడుదల చేయగా, యువతను బాగా ఆకట్టుకుంది. ఇదిగో ఈ క్రమంలో రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి పెంచారు. సినిమాలో హీరో, హీరోయిన్స్ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందో తెలియజేసేలా ఈ ట్రైలర్ ను వదిలారు.
రొమాంటిక్ బ్యాడ్ యాస్ గా రిలీజైన ఈ ట్రైలర్ లో ఆకాశ్ పూరీ క్యారెక్టర్ గురించి కొన్ని సన్నివేశాలు చూపించారు. పుట్టింది పడుకోవడానికి కాదు, చనిపోయాక పడుకో.. అంటూ ఆకాశ్ చెప్పే మాస్ డైలాగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా రోమాంటిక్ సినిమాను నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో ఆకాష్ పూరికి మంచి బ్రేక్ వస్తుందన్న ఆశతో ఉన్నారు పూరి జగన్నాధ్.