దేశం అన్నింటా ముందుకు సాగుతున్నా.. కులాల కట్టుబాట్లను ఇంకా చాలా గ్రామాలు అనుసరిస్తున్నాయి. పెత్తందార్లు, అగ్రవర్ణాల ఆధిపత్యానికి నిమ్న వర్గాలు వాటికి కట్టుబడి ఉంటున్నాయి. బావిలో నీరు తాగవద్దని, వీధిలో ఉండే మాట్లాడాలని, గుడిలోకి అనుమతి లేదన్నఆంక్షల వలయంలో ఇంకా నిమ్న వర్గాలు బతుకీడుస్తున్నాయి. కాదని గీత దాటితే..వెలివేయడాలు, గ్రామ బహిష్కరణలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. దీంతో వారు కూడా మిన్నకుండిపోతున్నారు. కానీ ఆ గ్రామంలోని దళితులు 80 ఏళ్ల కట్టుబాట్ల సంకెళ్లు తెంచి.. గుడిలోకి ప్రవేశించి.. వార్తల్లో నిలిచారు.
ఆ గ్రామమే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా లోని తెన్ముడియనుర్ గ్రామం. ఆ గ్రామానికి కూత వేటు దూరంలోనే ముత్తుమరియమ్మన్ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 80 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుండి ఆ ఊరి దళితులకు గుడిలోకి అనుమతించలేదు. ప్రతి ఏడాది పొంగల్ సందర్భంగా అక్కడ 12 రోజుల పాటు పండుగను నిర్వహిస్తారు. అయితే ఒక్క రోజు ఉత్సవాల్లో పాల్గొని, ఒక్క రోజు గుడిలో ప్రవేశించేందుకు అనుమతినివ్వాలని గ్రామ పెద్దను వారు వేడుకున్నారు. గ్రామ పెద్ద నిరాకరించడంతో తిరుమణ్ణామలైలోని హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) అధికారులను దళితులు ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన అధికారులు.. దళితులను గుడిలోకి అనుమతించడం లేదని నిర్ధారణకు వచ్చారు. దేవాలయాలు అందరివనీ, తక్షణమే వారిని గుడిలోకి ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. దీంతో 80 సంవత్సరాల కళ ఆ దళితులకు ఆదివారం నెరవేరింది. కాగా, అగ్రవర్ణాలకు సంబంధించిన వెయ్యి మందికి పైగా మహిళలంతా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గుడి బయట నిరసన తెలపడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహకారంతో.. భారీ భద్రత నడుమ ఆలయాన్ని సందర్శించుకున్నారు ఆ ఊరి దళితులు.
పెద్ద మొత్తంలో పిండి వంటలు, పూలు, పళ్లు సిద్ధం చేసుకుని గుడిలోకి ప్రవేశించి దేవుడ్ని దర్శించుకున్నారు. కాగా, ఆ గుడిలోకి ప్రవేశించిన దళితులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుమారు 300 మంది దళితులు గుడిలోకి ప్రవేశం కల్పించారు. హెచ్ఆర్ అండ్ సిఇ అధికారులు దళితులను గుడిలోకి ప్రవేశించేందుకు అనుమతి కల్పించిన ఘటనల్లో ఇటీవల కాలంలో ఇది మూడవది. ఇప్పటికీ ఇంకా దళితులను గుడిలోనికి అనుమతించకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.