ప్రభాస్ ప్రధాన పాత్రలో.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం మీద అంచనాలు అన్ని ట్రైలర్ చూడటంతో తుడిచిపెట్టుకుపోయాయి. దర్శకుడు ఓం రౌత్ మీద ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి ఓం రౌత్ పరువు తీస్తున్నారు నెటిజనులు. ఎందుకంటే..
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత నుంచి అతడు చేసిన సినిమాలు అన్ని పాన్ ఇండియా చిత్రాలే. సాహో, రాధేశ్యామ్ వంటి చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ బాహుబలి రేంజ్‌లో విజయం సాధించలేదు. మరీ ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే. వీటిలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మీద భారీగా అంచానలు పెట్టుకున్నారు అభిమానులు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు పెరిగాయి. సినిమా కూడా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.
ఇన్ని అంచానాల మధ్య విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ చూసి.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు కూడా మూర్ఛపోయారు. ఇదేంటి ప్రభాస్ లాంటి స్టార్ హీరో, కృతి సనన్ లాంటి బ్యూటీని తీసుకుని.. బొమ్మల సినిమా తీశాడు.. అసలు ప్రభాస్ గెటప్ ఏంటి.. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ తీరు.. అతడు వాడిన వాహనం.. ఇలా ప్రతి అంశంపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు ప్రభాస్ ఇలాంటి సినిమాకు ఎలా ఓకే చెప్పాడో అర్థం కాక తల పట్టుకున్నారు అభిమానులు.
రామాయణం పేరు చెప్పి.. ఓం రౌత్ ఏం సినిమా తీస్తున్నాడో తనకైనా తెలుసా.. అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా వందల కోట్లు ఖర్చు చేసి నాసిరకం గ్రాఫిక్స్ వాడారు అంటూ ఓంరౌత్‌ను తిట్టి పోశారు. ఇక ట్రైలర్ చూసి పలువురు రాజకీయ నేతలు కూడా ఆదిపురుష్ సినిమాపై, దర్శకుడు ఓం రౌత్‌పై మండి పడ్డారు. రామయాణాన్ని వక్రీకరిస్తే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
దాంతో ఓం రౌత్ టీం పునరాలోచనలో పడింది. దిద్దుబాటు చర్యలకు దిగింది. మరో వంద కోట్లు కేటాయించి.. ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించింది. వెరసి.. సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఆదిపురుష్ మీద బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇది చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరింత ఆగ్రహం పెరిగింది.
ప్రశాంత్ వర్మ సినిమాతో పోల్చి చూసిన తర్వత.. ఓంరౌత్ లాంటి దిగ్గజ దర్శకుడు.. వందల కోట్ల బడ్జెట్‌తో.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో తీస్తున్న సినిమా ఇంత నాసిరకంగా రావడం ఏంటి అని మండి పడ్డారు. ఓం రౌత్.. ప్రశాంత్ వర్మ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. తక్కువ బడ్జెట్‌లో ఎంత గొప్పగా గ్రాఫిక్స్ డిజైన్ చేయించాడు.. అసలు ఓం రౌత్‌కు రామాయణం గురించి అణువంతైనా తెలుసా అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో ప్రశాంత్ వర్మ.. అద్భుతమైన సినిమా తీస్తున్నాడు అని ప్రశంసించారు.
విమర్శల నేపథ్యంలో ఓం రౌత్ ఆదిపురుష్‌కి మార్పులు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన సీతారాముల పోస్టర్.. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన హనుమాన్ పోస్టర్ మీద కూడా భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక సీతమ్మ వారి మెడలో తాళి బొట్టు ఏది.. రాముడి ఒంటి మీద జంధ్యం ఏది.. అసలు రాముడి వస్త్ర ధారణ ఏంటి అంటూ మళ్లీ విరుచుకుపడ్డారు. అలానే హనుమాన్ పోస్టర్ మీద కూడా విమర్శలు వచ్చాయి. మార్పుల పేరు చెప్పి ఓం రౌత్ మరో వంద కోట్లు తగలేశాడు అంటూ విమర్శించారు.
ఇదిలా ఉండగానే తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రశాంత్ వర్మ హనుమాన్ చాలీసాను రిలీజ్ చేశాడు. అద్భుతమైన యానిమేషన్ వర్క్‌తో.. కొత్త గాయకులతో హనుమాన్ చాలీసాను పాడించి వీడియో రిలీజ్ చేయించాడు. ఈ పాటలో ప్రతి సందర్భానికి తగ్గట్టుగా క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ వర్క్, యానిమేషన్ అద్బుతంగా ఉందంటూ.. దర్శకుడి ప్రతిభ అంటే ఇలా ఉండాలి కదా అంటూ మరో సారి ఓం రౌత్ మీద మండి పడుతున్నారు ప్రేక్షకులు.
పండుగ పూట మరోసారి ప్రశాంత్ వర్మ ఓం రౌత్ పరువు తీశాడు.. మీకు చేతకాకపోతే.. మా తెలుగు సినిమాలు చూసైనా.. మా దర్శకులను అడిగి అయినా తెలుసుకొండి. అంతే తప్ప పవిత్ర రామాయణాన్ని ఇలా మీకు నచ్చినట్లు తప్పుల తడకగా చూపించకండి అంటూ చీవాట్లు పెడుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. తేజ సజ్జ నటిస్తోన్నహనుమాన్ కూడా పాన్ ఇండియా సినిమానే. మరి ఏ దర్శకుడు ప్రేక్షకుల మదిని గెలుస్తాడో చూడాలి. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరి ప్రతిభ మీకు నచ్చింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.