ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు అంతటా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాల, ఉద్యోగాల పేరుతో అమ్మాయిల పడక సుఖం కోరుకునే కామాంధులు అన్ని రంగాల్లోను ఉన్నారు. ఐతే ఇది కాస్త సినిమా రంగంలో ఎక్కువని చెప్పవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలు కోకొల్లలే అయినా, చాలా కొద్ది సందర్బాల్లో మాత్రం ఒకటి రెండు సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. గత కొన్ని రోజులుగా చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, డాన్సర్లు, సింగర్స్ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతున్నారు. తాజాగా మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి సంపత్ సినిమా ఇంటస్ట్రీలో తనపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టింది.
మలయాళ సినీ పరిశ్రమలో చాలా మంది తనను శారీరకంగా, మానసికంగా వేధించారని రేవతి చెప్పుకొచ్చింది. తనను వేధించిన మొత్తం 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్ బుక్ వేదికగా బయటపెట్టింది రేవతి. ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది.. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు.. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను.. అని రేవతి వ్యాఖ్యానించింది. రేవతిని వేధించిన వారిలో ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, దర్శకుడు రాజేశ్ టచ్ రివర్, ఓ డాక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఉన్నారు.
నటి రేవతి సంపత్ పై వేధింపులకు పాల్పడిన ప్రముఖుల్లో డైరెక్టర్ రాజేశ్ టచ్‌రివర్, నటుడు సిద్ధిక్,
ఫోటోగ్రాఫర్ ఆషికి మహి, నటుడు సిజ్జు, కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్ అభిల్ దేవ్, ప్రముఖ వైద్యులు అజయ్ ప్రభాకర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మాక్స్‌వెల్ జోస్, యాడ్ డైరెక్టర్ షానుబ్ కరావత్, క్యాస్టింగ్ డైరెక్టర్ రాగేంద్ పై,
డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్ నందు అశోకన్, ఈఎస్‌ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్ సరున్ లియో, తిరువనంతపురం పొన్ తూరా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ బిను, ఎంఎస్ పదూష్, సౌరబ్ కృష్ణన్ ఉన్నారు. వీరిలో డైరెక్టర్ రాజేశ్ టచ్‌రివర్ రేవతి ఆరోపణలు కొట్టిపారేశారు.