సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి తాను రావాలని అనుకుంటున్నట్లు తెలిపి మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కిన్ లేజర్ క్లినిక్ ను ప్రారంభించిన జయప్రద.. స్వతహాగా తెలుగు బిడ్డను అయినటువంటి నేను.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మీడియా ముఖంగా తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. “ఇక్కడి స్టేట్ ని వదిలి మళ్లీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అది సరైనది కాదేమోనని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజలకు సంపూర్ణమైన వసతులు కల్పించి, వాళ్లకు కావాల్సినట్లుగా 24 గంటలు నేనున్నానని నిలబడితేనే ప్రజలు అభినందిస్తారు. బీజేపీలో ఉన్నాను కానీ, నేను ఎక్కువగా ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో ఉన్నాను. దీన్ని నిర్ణయించాల్సింది పెద్దలు. ఆంధ్ర రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాజకీయాల్లోకి గానీ ఒక తెలుగు బిడ్డగా రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జయప్రద మాటలు సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలని భావిస్తున్నానని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే తాను ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. ఇక నటి జయప్రదను తెలుగు రాజకీయాల్లోకి పంపేందుకు పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి జయప్రద గారి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.