సినిమా ప్రపంచానికి అనేక మంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. అయితే కొంత మంది మాత్రమే పేరు తెచ్చుకుంటారు. మిగిలిన వారు అడపా దడపా సినిమాలు చేసి వెళ్లిపోతుంటారు. లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటారు. అటువంటి వారిలో ఒకరు నటి అర్చన. గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. తర్వాత చిన్న చిన్నక్యారెక్టర్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు.
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆ రంగు మొహంపై ఉన్నదంటే వారూ సినిమా రంగంలో కొనసాగుతున్నట్లు. లేదంటే ఫేడ్ అవుట్ అయినట్లే. ఈ రంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తమ నటనా కాలం చాలా తక్కువ. తమకు లభించిన తక్కువ వ్యవధిలోనే వారేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనేక మంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి ఫ్యాషన్‌తో వస్తుంటారు. అయితే వారిలో కొందరినీ మాత్రమే అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా తెలుగు నటీమణులకు అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన వాటినే అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తారు. మంచి సినిమాలు పడకపోతే.. టాలెంట్ ఉన్నా మరో సినిమా అవకాశం రాదు. చిన్న చిన్న అవకాశాలతో సరిపెట్టుకుంటారు. లేదంటే సినిమాలకు దూరమౌతున్నారు. అటువంటి వారిలో ఒకరు నటి అర్చన.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు తెలుగు అమ్మాయి అర్చన. తపన సినిమాతో ఆమె పరిచయం కాగా, తొలి నాళ్లలో పలు సినిమాలతో మెప్పించారు. నేను, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, సూర్యం వంటి చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు చేశారు. ఆ తర్వాత చిన్న పాత్రలకు పరిమితమయ్యారు. నువ్వు వస్తానంటే నేనొద్దాంటానా, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, అత్తిలి సత్తిబాబు, ఖలేజా వంటి సినిమాల్లో చేశారు. వీటితో పాటు పలు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో చేశారు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జగదీశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలుగు పరిశ్రమ తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అన్నారు. డ్యాన్స్ చేయగలనూ, భాష వచ్చు, యాక్టింగ్ చేయగలనను అవకాశాలు వస్తాయనని భావించానని, కానీ రాలేదన్నారు. తాను ఆడని సినిమాల్లో కూడా చేశానని, అయితే అందులో కూడా తాను చెత్త యాక్టింగ్ అయితే చేయలేదన్నారు. అదే సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో తాను సినిమాల్లో చేస్తున్నపుడు కొంత మంది ఇబ్బంది పెట్టేవారని, కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు లేకుండా చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు చెప్పినట్టు చేస్తే అవకాశాలు ఇస్తారని, యాక్టింగ్ మాత్రమే చూసి చాన్స్‌లు ఇవ్వరని వ్యాఖ్యానించింది.
కన్నడ భాషలో సినిమాలు చేసినపుడు కూడా తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. ఓ హీరో తనతో కలిసి అవార్డు తీసుకోనన్నారు. తాను మలయాళంలో ఓ సినిమా చేస్తున్నపుడు ఆ సినిమా హీరో తనకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేసేవాడని, తాను రిప్లై ఇవ్వలేదన్న కారణంగా ఆ మూవీ నుంచి తనను తీయించేశారని చెప్పారు. మూడు, నాలుగు రోజుల పాటు షూటింగ్ జరిగాక.. తీసేశారని తెలిపారు. కానీ తను అవన్నీ పట్టించుకోకుండా తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టానన్నారు. ఆ సమయంలో మా అమ్మ, తన కుటుంబం చాలా సపోర్ట్ చేసిందని తెలిపారు. నటి అర్చన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా వచ్చి అలరించారు.