విశాఖపట్నం- మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చని టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో స్థానిక లేక స్థానికేతర అని ప్రాంతీయ బేదాలు చూపడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మా ఎన్నికలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సినిమా రంగంలో అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ ఎక్కడైన కలిసి నటిస్తున్నామని సుమన్ అన్నారు. అప్పుడు లేని స్థానికత, ప్రాంతీయ సమస్య, ‘మా’ ఎన్నికల్లో ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ ఆర్టీస్టులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్న సుమన్, బ్రతుకు తెరువు లేక ఇబ్బంది పడుతున్న జూనీయర్, సీనియర్ ఆర్టిస్టులకు ఓల్డేజ్ హోమ్ ను ఏర్పాటు చేయ్యాలని సూచించారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం సుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలకు కనీసం మందులు కొనుక్కునే స్థోమత లేని ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారని సుమన్ చెప్పారు. అలాగే కోవిడ్ వలన చేతిలో పని లేక చాలా మంది ఆర్ధికంగా సతమతమవుతున్నారని గుర్తు చేశారు. ‘మా’ ఎన్నికల్లో గెలిచిన వారు అలాంటి వారందరిని ఆదుకునే ప్రయత్నం చేయాలని సుమన్ విజ్ఞప్తి చేశారు.
మూవీ ఆర్టీస్ట్ అసోసీయేషన్ ఎన్నికలో గెలిచినవారు మా అభివృద్ధికి కృషి చేయ్యాలని సుమన్ అన్నారు. మా ఎన్నికల్లో విమర్శళు, ప్రతి విమర్శలు ఎన్నికల వరకు మాత్రమేనని, ఎన్నికల తరువాత ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి, నటీ నటుల బాగోగుల కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మా’ అభివృద్ది కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్బంగా సుమన్ చెప్పారు.