ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో భార్యా భర్తలిద్దరూ పనులు చేయాల్సిందే. అందుకే పనులను తేలికగా చేసుకునేందుకు కొన్ని వస్తువులపై ఆధారపడిపోతున్నాం. పిండి రుబ్బేందుకు గ్రైండర్, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్, చట్నీలకు మిక్సీ, చల్లగాలికి ఏసీ, చపాతీలకు రోటీ మేకర్, చివరకు ఉల్లిపాయలు కట్ చేసుకునేందుకు కూడా కటర్స్ వచ్చేశాయి. దీంతో పని సులువు అవుతుందని గృహిణులు భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో అవసరమనుకుంటున్న వస్తువులు ఉసురు తీస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, వస్తువులు పేలి పలువురు దుర్మరణం చెందిన కథనాలు ఎన్నో విన్నాం. తాజాగా అటువంటిదే కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇంట్లో ఏసీ పేలి తల్లి, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. రాయ్ చూర్ జిల్లా శక్తినగర్‌లో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి రంజిత (31), ఇద్దరు కుమార్తెలు మృదుల (13), తరుణ్య (6) సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాండ్య జిల్లాలోని మాలవల్లి తాలుకా కోడిహళ్లి గ్రామానికి చెందిన రంజిత, భర్త సిద్ధ లింగయ్య, ఇద్దరు చిన్నారులతో కలిసి శక్తి నగర్‌లో ఉంటుంది. రంజిత భర్త రాయచూర్ థర్మల్ కేంద్రంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సోమవారం విధులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.
ముగ్గురు బయటకు వెళ్లి వచ్చాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం దట్టమైన పొగ వ్యాపించింది. ఇంటి కిటీకీల నుండి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బందితో సహా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మంటల్ని నిలువరించారు. ఏసీలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఏసీలో మంటల చెలరేగడానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. ఏసీలో ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.