హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా ధియేటర్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఐతే తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి థియేటర్ పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఈ థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రదర్శింపబడుతోంది. మంటల ధాటికి థియేటర్ స్క్రీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి.
తెల్లవారుజాము సమయంలో థియేటర్ లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది లోనికి వెళ్లి చూడగా మంటలు కనిపించాయి. దీంతో వారు వెంటనే యాజమాన్యంతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వెనువెంటనే ధియేటర్ దగ్గరకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ధియేటర్ లో ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే పరిస్థితి భయానకంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా సుమారు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.