నల్గొండ- రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అదే మండలంలోని వాడపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ముగ్గురు బైక్ పై వెళ్తూ.. బొత్తలపాలెం దగ్గరకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్‌ని బైక్ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్తలంలోనే ప్రాణాలు కోల్పోయారు. యువతి ఇంటర్ చదువుతుందని స్థానికులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన స్థలంలో యువతికి సంబందించిన ఇంటర్ పుస్తకాలు, కాలేజీ బ్యాగ్ చిందరవందరగా పడిపోయాయి.
ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. మనవడితో సహా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ ఫ్యామిలీతో పాటు, వాడపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.