బడిలో, కాలేజీలో, ఆఫీసుల్లోనే కాదూ.. ప్రయాణాల సమయంలో, టైలర్, ఆసుపత్రుల్లో, చివరకు గుడిలో కూడా వేధింపులు ఎదురౌతున్నాయి. ఇందులో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి మాతృమూర్తికి చేదు అనుభవం ఎదుర్కొంది.
ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటుంది. తమకు జరిగిన లైంగిక, ఇతర రకాలైన వేధింపులు గురించి చెప్పుకోలేక పంటిబిగువున భరిస్తున్న మహిళలు ఎందరో. బడిలో, కాలేజీలో, ఆఫీసుల్లోనే కాదూ.. ప్రయాణాల సమయంలో, టైలర్, ఆసుపత్రుల్లో, చివరకు గుడిలో కూడా ఇటువంటి వేధింపులే. మగవాళ్ల వేధింపులు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు బలౌతున్నారు. ఇందులో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. కఠినమైన న్యాయ వ్యవస్థలు లేనంత వరకు ఈ దారుణాలు కొనసాగుతుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి మాతృమూర్తికి చేదు అనుభవం ఎదుర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మాతృమూర్తి సంసారో దేవి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఆమె పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన ఏప్రిల్ 9న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే హిమాచల్ సీఎం సుఖ్విందర్ తల్లి ఈ నెల 9న కడుపు నొప్పితో బాధపడగా.. తన బంధువులను తీసుకుని నాదౌన్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు వైద్యుడు. ఈ విషయం కుమారుడి దృష్టికి చేరింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన హమీర్‌పూర్ జిల్లాలో పర్యటించారు.
మూడు రోజుల పర్యటన కోసం ఏప్రిల్ 10న అక్కడకు చేరుకున్నారు సీఎం సుఖ్విందర సింగ్. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎమ్ఓ)ను వివరణ కోరారు. అనంతరం డాక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ షోకాజ్ నోటీసుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు వివరణ ఇచ్చారు. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. రోగితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే సూచించానని పేర్కొన్నాడు. అంతేకాదు, ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు ఔషధాలు కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించాడు. దీనిపై విచారణకు అధికారులు ఓ కమిటీని నియమించారు.