తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీవారిని రోజుకు 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు భూరి విరాళాలను అందిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు భూరి విరాళాన్ని అందించారు.
దక్షిణాదిలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకుంటారని వినికిడి. కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వెంకన్నను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు భూరి విరాళాలను అందిస్తుంటారు. అందుకే దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన దేవాలయాల్లో రెండవ స్థానంలో ఉంది తిరుపతిలోని వెంకన్న దేవాలయం. అయితే ఓ భక్తుడు కోట్ల విలువ చేసే భూమిని విరాళాన్ని అందించి అపర భక్తిని చాటుకున్నారు.
బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ.. తన వందల ఎకరాల భూమిని వెంకన్నకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలం రేగడిపల్లిలో.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోతేగుంటలో కలిపి ఆయనకు 262 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని, ఆ భూమిలో పండించే పంటలను టీటీడీకి విరాళంగా ఇస్తానన్నారు. ఈ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులు, పూల సాగు చేసి, ఆ పంటలను టీటీడీకి అప్పగిస్తాని మురళీ కృష్ణ చెప్పారు. శ్రీవారికి అప్పగించనున్న భూముల్లో పంటలు పండించి.. ఆ ఫలసాయాన్ని అందించినప్పుడే వేంకటేశ్వరస్వామికి సేవ చేసినట్లవుతుంది అంటున్నారు. ఈ భూములను సీఎస్ జవహర్‌రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి పరిశీలించారు.
అధికారుల బృందం నీటి వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. భూముల మ్యాపును పరిశీలించి.. భూముల రికార్డుల మార్పుపై రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు తెలంగాణ సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఏపీ సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందించారు. స్వామి వారికి రూ 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర తయారు చేయించారు.
మరోవైపు తిరుమల శ్రీవారికి శనివారం ఒక బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ దంపతులు రూ.31 లక్షల విలువైన బస్సును దేవస్థానానికి అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అలాగే జంషెడ్ పూర్ కు చెందిన సర్ లాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఆ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.