స్పెషల్ డెస్క్– పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు పెద్దలు. అదే సమయంలో ప్రేమకు వయసుతో సంబంధం లేదు మనసుతో సంబంధం అని కూడా ఉంటారు. తెలంగాణలో జరిగిన ఓ వివాహాన్ని చూస్తే ఈ రెండు నిజమే అని అనిపించక మానదు. ఎంతుకంటే లేటు వయసు పెద్దాయన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అంతే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు.
ఆ పెద్దాయనకు 73 ఏళ్ళు ఐతే, ఆమెకు 26 ఏళ్ళు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా, ఇద్దరికి మనసులు కలవడంతో వివాహం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింతకుంట తండా కు చెందిన 73 ఏళ్ల కిషన్ రాధోడ్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో వారంతా వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు.
కిషన్ రాధోడ్ భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఇక అదే జిల్లా కుభీర్ మండలం రంజని తండాకు చెందిన 26 ఏళ్ల సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు ఒక పాప ఉంది. కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్ రాధోడ్ కు సునీత పరిచయం అయ్యింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పగా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో కిషన్ రాధోడ్, సునీత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి బంధువులతో పాటు, గ్రామస్తులంతా హాజరయ్యారు.