కాపాడాల్సిన వారే భక్షిస్తే.., ప్రాణాలు నిలపాల్సిన వారే డబ్బు మత్తులో మునిగి ప్రాణాలు తీస్తుంటే.. ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి? ఈ కరోనా కష్ట కాలంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. కరోనా ట్రీట్మెంట్ ని ఓ బిజినెస్ గా మార్చేసుకుని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు ఇలాంటి హాస్పిటల్స్ ని గుర్తించి షోకాజ్ నీటీసులు జారీ చేస్తున్నా.., పరిస్థితిల్లో మార్పు రావడం లేదు. తాజాగా భాగ్యనగరంలో ఇలాంటి ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.52 లక్షల బిల్ వసూల్ చేసి కూడా ప్రముఖ ఆసుపత్రి వైద్యులు ఓ యువతి ప్రాణాలను కాపాడలేకపోయారు. కానీ… డాక్టర్స్ నిర్లక్ష్యానికి బలైపోయిన ఆ యువతి కూడా ఓ డాక్టర్ కావడం విశేషం. ఈ వివరాల్లోకి వెళ్తే.., హైదరాబాద్ కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ భావనకి కొన్ని నెలల క్రితమే వివాహమైంది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆమె రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త కళ్యాణ్ కూడా అదే ప్రాంతంలో డాక్టర్ గా సర్వీస్ చేస్తున్నారు. కొత్త జంట. ఆనందమైన జీవితం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్న వీరి జీవితాన్ని కరోనా రక్కసి కాటు వేసింది. కొవిడ్ బారినపడటంతో భావన ఏప్రిల్ 22న భావన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మే 6 వరకు చికిత్స పొందారు. అక్కడే ఆమె కొవిడ్ నుంచి కోలుకున్నారు. కానీ.., తరువాత కాలంలో ఈమె ఆరోగ్యం మళ్ళీ క్షిణించింది. దీంతో.. ఆమెకి ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.
26 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. కానీ.., ఇక్కడ డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేక రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయిందని, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆమె భర్త కల్యాణ్ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్ స్థాయి 94గా ఉందని, తర్వాత పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయిందని తెలిపారు. అనంతరం ఫ్లూయిడ్ ఓవర్లోడ్ చేయడంతో గురువారం వేకువజామున 4.30గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని పేర్కొన్నారు. ఆసుపత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామని, మరో రెండు వారాల్లో డిశ్ఛార్జి కావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు. కానీ.., ఈ ఘటనలో వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ.., ఎక్మో పైపు విషయంలో ఏర్పడిన సాంకేతిక సమస్య గురించి మాత్రం వీరు స్పందించలేదు. దీంతో.., ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలనే కాక.., ఇలా డాక్టర్స్ ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి.., ఇలా కొన్ని వ్యవహరిస్తున కార్పొరేట్ హాస్పిటల్స్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.