వనపర్తి రూరల్- ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. మనం ఏదైనా కొనాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్ లద్వార డబ్బులు చెల్లించేస్తున్నారు. ఐతే అత్యవసరం ఐతే ఇక ఏటీఎం కు వెళ్లి డబ్బులు డ్రా చేయాల్సిందే అనుకొండి. ఒక్కోసారి ఏటీఎం లలో చాలా మందికి చేదు అనుభవాలు దురవుతుంటాయి. మనం బ్యాంకు కార్టు ఏటీఎం మిషిన్ లో పెట్టి, డబ్బులు డ్రా చేస్తే.. ఒక్కోసారి మన అకౌంట్ లోంచి డబ్బులు కట్ అవుతాయి కాని డబ్బులు మాత్రం రావు. దీంతో ఏంచేయాలో తెలియని అయోమయం నెలకొంటుంది. ఐతే బ్యాంకుకు కంప్లైంట్ ఇస్తే మళ్లీ మన డబ్బులు మనకు వస్తాయనుకొండి. ఇలా చేదు అనుభవాలే కాదు.. ఏటీఎంలలో ఒక్కోసారి విచిత్రాలు కూడా జరుగుతుంటాయి. ఎంటర్ చేసిన డబ్బుల కంటే ఎక్కువ కూడా వస్తుంటాయి కొందరికి. సాంకేతిక కారణాల వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఇదిగో ఇలాంటి వింత ఘటన తెలంగాణలోని వనపర్తిలో జరిగింది.
జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెంబర్ వన్ ఏటీయంలో 100 రూపాయలకు బదులు ఏకంగా 500 రూపాయలు డ్రా అయ్యాయి. ఏదో పొరపాటున వంద ఎంటర్ చేయబోయి, ఐదు వందల రూపాయలు ఎంటర్ చేశానేమోనని ఆ వ్యక్తి అనుకున్నాడు. ఆ తరువాత మరో వ్యక్తి కూడా ఏటీఎంలో వంద రూపాయలు డ్రా చేశాడు. కానీ మరలా ఐదు వందల రూపాయలే వచ్చింది. ఎందుకైనా మంచిదన ఆ వ్యక్తి అకౌంట్ ను చెక్ చేసుకుంటే.. వంద రూపాయలే డ్రా అయినట్టు చూపించింది. ఈ విషయం అలా అలా అందరికి తెలియడంతో క్షణాల్లో జనమంతా గుమిగూడారు. పోటీలు పడి మరీ డబ్బులు డ్రా చేసుకున్నారు. ఐతే పెద్ద ఎత్తున జనం కనిపించే సరికి పెట్రోలింగ్ పోలీసులు అనుమానం వచ్చి ఏటీఎం దగ్గరకు వచ్చి చూశారు. దీంతో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినవారంతా పోలీసులను చూసి పారిపోయారు. ఆ తరువాత బ్యాంకు సిబ్బందికి విషయం చెప్పడంతో వారు వచ్చి తనిఖీ చేశారు. సాంకేతిక లోపం వల్ల ఇలా వంద నోటుకు బదులు ఐదు వందల నోటు వచ్చిందని వారు తెలిపారు. ఐతే ఎంత మేర ఇలా నగదును డ్రా చేశారన్నదానిపై మాత్రం బ్యాంకు అధికారులు వివరాలు చెప్పలేదు.