తిరుపతి- ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆపద మొక్కుల వాడిగా, వడ్డీ కాసులు వాడిగా పేరున్న శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల ఆలయంలోని హుండీలో కానుకలు వేయడంతో పాటు, టీటీడీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఐతే టీటీడీ దగ్గర భక్తులు విరాళంగా ఇచ్చిన 49 కోట్ల రూపాయలు ఉపయోగం లేకుండా ఉన్నాయి.
2016లో భారత ప్రభుత్వం ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసింది. ఆ సమయంలో టీటీడీ తన దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునే విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించింది. దీంతో టీటీడీ దగ్గర మొత్తం 49.70 కోట్ల రూపాయల పాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు అలాగే ఉండిపోయాయి.1.8 లక్షల వెయ్యి రూపాయలు, 6.34 లక్షల 500 రూపాయల పాత నోట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అంతే కాకుండా పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. టీటీడీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి, రిజర్వ్ బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దైన పాతనోట్లకు సంబంధించి ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఇది భక్తుల మనోభావాలకు సంబందించిన అంశం కావడంతో పాత నోట్లను ఏం చేయాలో తెలీక తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచనలో పడింది. మొన్నామధ్య జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని, రద్దైన నోట్లను ఎక్కువ రోజులు తమ దగ్గర ఉంచుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. పాతనోట్లు రద్దై ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న నేపధ్యంలో, ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందింస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.