మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘సందర్శకుల కోసం ఎదురు చూస్తుంటాయి. ‘మ్యూజియంలో ఉన్నవాటిని ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు.
మ్యూజియంలోంచి రోడ్డు మీదకు వచ్చిన మమ్మీలను చూడ్డానికే త్వరపడాలి. మళ్లీ అవకాశం ఎప్పటికో గానీ రాదు’ అని ఈజిప్టు పురావస్తు శాఖ చాటింపు వేయిస్తోంది. ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్’కి మధ్య దూరం 8 కి.మీ. సాధారణ ప్రయాణ దూరం 13 నిముషాలు. పదమూడు నిముషాల ప్రయాణానికి మమ్మీలకు నలభై నిముషాలు పట్టబోతోందంటే.. మమ్మీలు ఎంత నెమ్మదిగా, ఎంత పదిలంగా, ఎంత కదిలీ కదలనట్లుగా బట్వాడా అవబోతున్నాయో చూడండి. ప్రాణం పోయాక కూడా మమ్మీలు వేల ఏళ్లపాటు భద్రంగా ఉన్నాయంటే ప్రాణంతో ఉన్నట్లుగా వారు భావిస్తారు. కదలికల వల్ల కాళ్లో, వేళ్లో, కళ్లో కాస్త చెదిరినా వాటి ప్రాణం పోయినట్లే. మళ్లీ వాటిని అతికించడానికి ఓ పెద్ద సర్జరీనే అవసరం అవుతుంది. సర్జరీ చేసినట్లు కనిపిస్తే అప్పుడది అతికించినట్లే అవుతుంది తప్ప అమరిక అవదు. అందుకే అంత జాగ్రత్త. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ‘ఫారోస్ గోల్డెన్ పరేyŠ ’ అనే పేరు పెట్టింది. మమ్మీలను ఉంచిన రథాల అలంకరణ పూర్తిగా ఈజిప్టు సంప్రదాయ శైలిలో ఉంటుంది. అలంకరణ రథానికే తప్ప మమ్మీల గాజు పెట్టెలకు కాదు. మ్యూజియంలో అవసరం లేదు కానీ.. ప్రయాణ మార్గంలో ఎగుడు దిగుళ్లను ఇప్పటికే చదును చేసి ఉంచారు. ఒక్కో రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు అనే వివరాలు ఉంటాయి. అందరి కన్నా ముందు వరసలో రెండవ సీకెనార్ తావో చక్రవర్తి రథం ఉంటుంది. క్రీ.పూ. 1560–1555 కాలం నాటి పాలకుడు ఆయన. ‘ధైర్యవంతుడు’ అని పేరు. ఆయన వెనుకే తొమ్మిదవ రామ్సీస్ మమ్మీ రథం కదులుతుంది. క్రీ.పూ. 12వ శతాబ్దం చక్రవర్తి రామ్సీస్. ఆ వెనుక రెండవ రామ్సీస్ చక్రవర్తి, ఆ వెనుక మహా రాణి హాట్షిప్సట్. అతి శక్తిమంతురాలిగా ఆమె ప్రసిద్ధి. ఆ వెనుక ఒకరొకరుగా వయసుల వారీగానే కాకుండా చారిత్రక ప్రాధాన్యాన్ని బట్టి కూడా మెల్లిగా ‘కదులుతారు’. ఇరవై రెండు మంది రాజులు, రాణులు ఒకే దారిలో ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రథంపై ఊరేగింపుగా వెళుతుంటే కేవలం అదొక ఉత్సవంగా మాత్రమే ఉండదు. కన్నుల పండుగైన మహోత్సవంలా జులుస్ ఉంటుంది. ఆశ్చర్యంగా అబ్బురంగా భయం భయంగా!! ఆశ్చర్యమూ, అబ్బురమూ ఎందుకో చెప్పనక్కర్లేదు. భయం మాత్రం.. ఆ రాజులు, రాణులు ‘మమ్మీలు’ అయినందుకు! భయం అంటే భయం అని కాదు. థ్రిల్లింగ్‌గా అనుకోండి.