ఒక వ్యక్తి ఏకంగా 335 మందితో డేట్ చేయడం ఏమిటి? ఇంకో 30 మంది కోసం వెయిట్ చేయడం ఏమిటి? దాని గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడం ఏమిటి అని విస్తుపోతున్నారా? అసలు 365 మంది మహిళలతో డేటింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని చెన్నైకి చెందిన సుందర్ రాము ఓ ఫిల్మ్ యాక్టర్. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అతని జీవితాన్ని మార్చి వేసింది. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అకృత్యాలకు ఏదైనా పరిష్కారం కనుగొనాలనుకున్నాడు. కనీసం తన వంతుగా ఏదైనా ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే 365 డేట్స్ అనే కాన్సెప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షతని వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. వారిలో చైతన్యం తీసుకుని రావాలన్నదే సుందర్ రాము ధ్యేయం.
2014, డిసెంబర్ 31న ఫేస్‌బుక్‌లో తన ఐడియాని పోస్ట్ చేశాడు సుందర్. అయితే.., ఇక్కడ డేటింగ్ అంటే శృంగారభరితమైన అంశం కాదు. సమాజంలో మహిళల పట్ల ప్రేమని పంచుకోవడం. వారి హక్కులను తెలియచేయడం. వారి బాధలను తీర్చడానికి సలహాలు ఇవ్వడం. ఇదే 365 డేట్స్ కాన్సెప్ట్. తనతో డేట్ కి వచ్చిన ప్రతి మహిళకి సుందర్ ధైర్యాన్ని చెప్తారు. వారు జీవితంలో ఎదగడానికి కావాల్సిన సలహాలు ఇస్తారు. మొత్తంగా వారి పట్ల స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తారు. ఇదే డేట్ 365 థీమ్.
ఈ ప్రాసెస్ లో ఎలా సక్సెస్ అయ్యాడో సుందర్ రామ్ వివరించారు కూడా. డేట్ 365 అంటే సెక్స్ అస్సలు కాదు. ఇది ఒక ఆత్మీయ కలయిక మాత్రమే. ఈ డేట్ 365 లో భాగంగా.. నేను మా నానమ్మ, చెత్త ఎత్తే మహిళ, పళ్లు అమ్ముకునే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమందితో డేట్ లో పాల్గొన్నా. అందరిదీ ఒక్కో కష్టం. ఒక్కో బాధ. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న ఆడవాళ్లు కూడా విచక్షణకి గురి అవుతూనే ఉన్నారు. వారందరికీ నాకు తోచిన సలహాలు అందించాను. కానీ.., అందరికన్నా మా నానమ్మతో వెళ్లిన డేట్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు సుందర్ రాము. మరి చూశారు కదా.. ఈ డేట్ 365 కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.