అప్పటి వరకు ఆడుకున్న బాలిక తెల్లారే సరికి గుండె పోటుతో మరణించింది. ఈ ఘటన మర్చిపోక ముందే 35 ఏళ్లు కూడా నిండని ఓ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కారణంగా తుది శ్వాస విడిచాడు. విధులకు హాజరైన వ్యక్తి ఆసుపత్రిలో విగత జీవిగా మారాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
గుప్పెడంత గుండె పగ బడుతోంది. ఊహాతీతంగా ప్రాణాలు బలిగొంటుంది. జలుబు, జ్వరం, అలసట వంటి చిన్న అనారోగ్య సమస్యలను కూడా కనిపించిన వారిని సైతం మదిని పిండేస్తూ ఊపిరి తీస్తోంది. లబ్ డబ్ అని కొట్టుకోవాల్సిన గుండె ఆగిపోయి.. కుటుంబాలు లబోదిబోమని ఏడ్చేలా చేస్తోంది. వరుసగా హార్ట్ స్ట్రోక్ మరణాలు చోటుచేసుకుని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అటు తెలంగాణాలో 13 ఏళ్ల బాలిక ఘటన మర్చిపోక ముందే 35 ఏళ్ల కూడా నిండని వ్యక్తి గుండె పోటు కారణంగా కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడలో నెలకొంది. అయితే అతడు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.
పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలేనికి చెందిన ఉమ్మిడి వెంకటేష్ (32) జేఎన్ ఫార్మాసిటీలోని యుజియా స్టైరెల్స్ పరిశ్రమలో పని చేస్తున్నారు. శుక్రవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. అయితే కొంత అనారోగ్యంగా ఉందని చెప్పడంతో క్యాంటీన్‌లో తోటి కార్మికులు సపర్యలు చేశారు. కొంచెం తేరుకున్నాక వెంకటేష్ విధుల్లోకి వెళ్లాడు. అనంతరం ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలి పోయాడు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటేష్‌కు భార్య, నాలుగు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుప్రతికి చేరుకుని భోరున విలపించారు.
విధి నిర్వహణలో చనిపోయినందున వెంకటేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు హాస్పిటల్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. నష్టపరిహారంతో పాటు మృతుని భార్యకు కంపెనీలో ఉద్యోగం కల్పించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కోటి పరిహారాన్ని చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్దకు కంపెనీ ప్రతినిధులు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. వీలైనంత సాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. వెంకటేష్ మృతదేహాన్ని విశాఖలోని షీలానగర్ కిమ్స్ ఆస్పత్రి మార్చరీలో భద్రపరిచారు. ఎటువంటి ఆందోళనకర సంఘటనలు జరగకుండా గాజువాక ఎస్‌ఐ కొల్లి సతీష్, పరవాడ ఎస్‌ఐ తేజేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.