బిజినెస్ డెస్క్- కరోనా లాంటి క్లిష్ట సమయంలో చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన కుటుంబాలు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అందుకే ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆర్ధికంగా అండగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అనేక పధకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైంది ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదవశాత్తు మరణించినా, అంగ వైకల్యం ఏర్పడినా ఈ పధకం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం సంవత్సరానికి 12 రూపాయ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
అది కూడా మనం మన బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ లో ఒక అప్లికేషన్ నింపి ఇస్తే చాలు, ప్రతి సంవత్సరం బ్యాంకు నుంచి నేరుగా ప్రీమియం చెల్లించేస్తారు. ఈ బీమాకు సంబంధించి ఈ నెల మే 31 లోపు బ్యాంకులు 12 రూపాయల ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం 12 రూపాయల తగ్గింపు గురించి బ్యాంకులు వారి ఖాతాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇస్తున్నాయి. పీఎంఎస్‌బీవై పథకంలో చేరిన వారికి మాత్రమే బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అవుతుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యొక్క కవరేజ్ కాలం ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. అందువల్ల ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటే ప్రతి సంవత్సరం మే నెలలో రెన్యువల్ ప్రీమియం చెల్లించాలి.
ఈ బీమా ఒక సంవత్సరం కవర్ చేస్తుంది. బ్యాంకు ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్లలోపు వారందరూ ఈ పథకంలో చేరవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం కోసం బీమా అందించబడుతుంది. గుండెపోటు మొదలైన సహజ కారణాల వల్ల జరిగే మరణాలకు బీమా వర్తించదు. ఈ పథకం కింద రిస్క్ కవరేజ్ ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, లేక ప్రమాదంలో పూర్తి వైకల్యం ఏర్పడినా 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యానికి 1 లక్ష రూపాయలు చెల్లిస్తుంది. భీమా తీసుకున్న వ్యక్తి మరణం తర్వాత బీమా చేసిన వ్యక్తి నామినీ యొక్క బ్యాంక్ ఖాతాకు బీమా క్లెయిమ్ అందిస్తుంది.