ముంబయి(నేషనల్ డెస్క్) – ఆ చిన్నారికి వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు. ఐదు నెలల వయుసున్న ఆ చిన్నారి ప్రపంచంలోనే అరుదైన వ్యాదితో పుట్టింది. ఆ వ్యాధిని నయం చేయాలంటే వేలు, లక్షలు కాదు కోట్ల రూపాయలు కావాలి. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఐదు నెలల వయసున్న ధైర్యరాజ్ సింగ్ రాధోడ్ కు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇది కండరాలకు సంబందించిన వ్యాధి. దీన్ని నయం చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు చిన్నారిని పరీక్షించిన వైద్యులు. చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాలా16 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏంచేయాలో తల్లిదండ్రులకు అర్ధం కాలేదు. తమ కంటి పాపను బతికించుకునే మార్గం ఏంటని తల్లడిల్లిపోయారు.
అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సమయంలోనే ఆ చిన్నారి కోసం ప్రపంచం కదిలింది. ఓ స్వఛ్చంద సంస్థ ముందుకు రావడంతో క్లౌడ్ ఫండింగ్ ద్వార నిధులను అర్ధించారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తీరా ఫైట్స్ ఎస్ఎంఏ పేరుతో అకౌంట్లు తెరిచారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి వారు తమవంతుగా సాయం చేశారు. నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 64 వేల మంది సాయం చేయగా 16 కోట్ల రూపాయలు జమయ్యాయి. దీంతో అమెరికా నుంచి ఖరీదైన మందును తెప్పించిన వైద్యులు ముంబై హిందూజా ఆస్పత్రిలో ఈ బుధవారం చిన్నారికి ఇంజెక్షన్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇంజెక్షన్‌పై జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీ 6.5 కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాఫీ చేశారు. మొత్తానికి చిన్నారికి చికిత్స అందడంతో తల్లిదండ్రులు, వైద్యులతో పాటు సాయం చేసిన వారందరు ఊపిరి పీల్చుకున్నారు.