చేపట వేటకు వెళ్లిన 12 పడవలు నీట మునిగిపోయాయి. వీటిల్లో 23 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ఈ విషాద ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గుజరాత్ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
అదే సమయంలో అరేబియా సముద్రం సమీపంలోని గిర్-సోమ్‌నాథ్ ప్రాంతంలో, బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన 12 మత్స్యకారుల పడవలు మునిగిపోయాయి. వేటకు వెళ్లి అధికారుల హెచ్చరికలతో తిరిగి వస్తుండగా.. బలమైన గాలులు వీచడం.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం నేవీ అధికారులు, రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.