కుటుంబాల్లో కలహాలకు కారణమౌతోంది మద్యం. జీవితాలను చిధ్రం చేస్తుంది. దీనికి బానిసలైన మందు బాబులు..కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఈ వ్యసనం కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో ఈ మద్యానికి వ్యతిరేకంగా ఓ ఊర్లోని మహిళలు ఉద్యమించారు.
మద్యం కారణంగా అనేక జీవితాలు ఛిన్నాభిన్నామవుతున్నాయి. సంపాదించిన కష్టాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా దారి మధ్యలో వచ్చే మద్యం దుకాణంలో తగలబెడుతున్నారు. దీనికి బానిసలైన వారు.. ఆ ఊబిలో కూరుకుపోయి బాధ్యతలు, బంధాలను మర్చిపోతున్నారు. ఈ ఒక్కటి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. భార్య ఎంత పోరు పెడుతున్నా వినిపించుకోని భర్త.. మద్యం మత్తులో జోగుతున్నాడు. దీని వల్ల అనారోగ్యానికి గురై, అర్థంతరంగా తనువు చాలించి, ఇల్లాలిని, పిల్లల్ని అనాధలు చేస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా ఎన్నికల హామీల భాగంలో మద్య నిషేధాన్ని చేపడతామని చెప్పి, ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఇది షరా మామూలుగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరిలో మద్య నిషేధం ప్రకటిస్తూ తీర్మానం చేసింది. ఆ ఊరి ఎక్కడ ఉందంటే మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామం. ఈ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఆ ఊరి మహిళలంతా ఏకమై ర్యాలీని చేపట్టారు. మద్యానికి బానిసలై చాలా మంది ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టపోతున్నారంటూ పేర్కొంటూ బెల్ట్ షాపుల వద్ద నిరసనకు దిగారు. ఈ ఉద్యమానికి స్పందించిన గ్రామ పంచాయతీ మద్యం అమ్మిన వారికి, తాగినా వారికి కూడా జరిమానా విధించాలని తీర్మానించింది. ఊర్లో బెల్ట్ షాపులు నడిపితే రూ. 10వేల ఫైన్, మద్యం సేవిస్తే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని సర్పంచ్ చెప్యాల మల్లేశం తెలిపారు.
అంతేకాకుండా మద్యం అమ్ముతున్న, తాగుతున్న వారిని పట్టిస్తే రూ. 2వేల నజరానా ఇస్తామని గ్రామ సర్పంచ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రతి బెల్డ్ షాపు వద్దకు వెళ్లి ఈ రూల్స్ తెలియజేశారు. ఈ ర్యాలీలో వార్డు సభ్యులు నర్సింహులుగౌడ్, సత్యం, సుశీల, మహిళా సంఘాల అధ్యక్షులు తాళ్ల స్వప్న, గజవెల్లి స్వప్న, లత, వీఏఓ రామచంద్రం యాదవ్, మల్లీశ్వరి పాల్గొన్నారు. మద్యంతో జీవితాలు ఛిద్రమవుతున్నా, ఎన్నికల హామీలకు మాత్రమే ప్రభుత్వాలు పరిమితం చేస్తున్న సంపూర్ణ మద్య పాన నిషేధాన్ని అమలు చేస్తున్న ఈ గ్రామ పంచాయతీ పలువురికి ఆదర్శంగా నిలవనుంది.