సోనూసూద్.. సోనూసూద్.. సోనూసూద్.. ఇప్పుడు ఇండియా జపిస్తున్న తారక మంత్రం ఈ పేరు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తూ.., వారికి సరైన సమయంలో సహాయం చేస్తూ సోనూసూద్ దేవుడు అయిపోయాడు. ఆక్సిజన్ లేక, హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ప్రాణం కోసం పోరాడుతున్న ప్రజలకి ఆయన సంజీవని అయ్యాడు. ఇందుకే ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సోనూసూద్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కానీ.., ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? కొన్ని వర్గాల వారు సోనుసూద్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవని అనుమానిస్తున్నారు. సోనూసూద్ వెనక ఎవరున్నారు అని ఆరాలు తీస్తున్నారు. క్లిష్ట సమయంలో దేశానికే దన్నుగా నిలిచిన రియల్ హీరోని అనుమానిస్తున్న వారి కోసమే ఈ ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పగలరా?
1) దేశంలో ఎవరికి, ఏ అవసరం వచ్చినా సోనూసూద్ సహాయం చేసేస్తున్నాడు కదా? ఆయనకి ఇంత డబ్బు ఎక్కడ నుండి వస్తుంది అన్నది కొంతమంది ప్రశ్న. సోనూసూద్ అందరికీ సహాయం చేస్తున్న మాట వాస్తవం. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. వీటిలో సింహ భాగం ఆయన ఆస్తులు తెగనమ్మి పెట్టినవే. పోయిన ఏడాది వరకు ఆయన అసలు ఎలాంటి ఫౌండేషన్ ని స్థాపించకుండానే ఈ సేవలు చేశాడు. కానీ.., సెకండ్ వేవ్ లో కష్టాల్లో ఉన్న ప్రజలు ఎక్కువ కావడంతో అయన ఫౌండేషన్ కి విరాళాలు వస్తున్నాయి. వాటిని సోనూ చాలా జాగ్రత్తగా ప్రజలకే ఖర్చు చేస్తన్నాడు. ఈ విషయం కాదని ఎవరైనా చెప్పగలరా?
2) మతాల ప్రస్తావన లేకుండా మన దేశం ముందుకి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ కి కూడా మతం రంగు పులిమేశారు. అవును.. సోనూసూద్ ఒక ముస్లీమ్. ముస్లీమ్ అయితే దేశ సేవ చేయకూడదా? సోనూసూద్ ఈ సంవత్సర కాలంలో కేవలం ఆ వర్గం ప్రజలకే సహాయాన్ని అందించాడా? మన దేశంలో ఎందరికో స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం ఆజాద్ తన మేధా శక్తిని కొన్ని వర్గాల శ్రేయస్సుకే వాడారా? లేదు కదా? సోనూసూద్ సహాయ చర్యలు కూడా ఇలానే అందరికీ అందుతున్నాయి. మరి ఈ విషయంలో మతం గోల దేనికి? సోనూసూద్ ఇన్నేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా సెక్యులర్ కామెంట్స్ చేశాడా? మన అలాంటప్ప్పుడు ఆయన మతం , కులం ఏదైతే ఏముంది?
3) సోనూసూద్ వెనక కాంగ్రెస్ ఉంది. వాళ్లే ఆయన చేత ఇదంతా చేపిస్తున్నారు. ఫండింగ్ చేస్తున్నారు అని మరో విమర్శ. తలకాయలో గుజ్జు ఉన్న ఎవ్వరూ ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరు. సోనూసూద్ చేత ఇంత చేపించాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఏంటి? ఈ చేసే మంచి ఏదో వాళ్ళే చేస్తే.. వారికే ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది కదా? ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా సోనూసూద్ సేవలు కొనసాగుతోన్నాయి. మరి దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా?
4) ఇక ఇలాంటి ఆరోపణే మరొకటి. సోనూసూద్ కి చైనా నుండి ఫండ్స్ వస్తున్నాయి అనే ఆరోపణ. చైనా ఫండ్స్ ఇచ్చి మరీ.., మన ప్రజలను ఎందుకు బతికిస్తుంది? మనకి ఎందకు సహాయం చేస్తుంది? చైనా ఒకవేళ మన దేశం మీద విజయం సాధించాలి అనుకుంటే.. అది ఒక్క వ్యక్తిని లొంగతీసుకుంటే సాధ్యం అయ్యే పనేనా? అసలు ఈ విమర్శలో అర్ధం పర్ధం ఉందా?
5) సోనూసూద్ సహాయం చేయాలి అనుకుంటే.. ప్రభుత్వం కన్నా ముందే చేస్తున్నాడు. ఇంత నెట్వర్క్ అతి తక్కువ సమయంలో ఆయనకి ఎక్కడ నుండి వచ్చింది అనేది మరికొంత మంది ప్రశ్న. సోను టీమ్ లో ఉన్న వీరంతా వాలంటీర్స్. వీరికి సోనూసూద్ కి ఎలాంటి సంభంధం లేదు. ఆయన చేసే పని నచ్చి, స్వచ్ఛందంగా ఆయనతో చేతులు కలిపిన వాళ్ళు వీరు. ఇలా తన ఫౌండేషన్ లో జాయిన్ అయిన వాళ్ళ ద్వారానే సోనూసూద్ .. ఆయా ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. పైగా.., ఫోన్ పే, గూగుల్ పే.. లాంటి ఇన్ని ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఓ మనిషికి త్వరగా సహాయం చేయలేమా?
6) ఇక సోనూసూద్ కి పబ్లిసిటీ పిచ్చి అందుకే చేసే ప్రతి సహాయాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని మరో విమర్శ. చేసే పనిలో మంచి కనిపించాలి గాని.., మనిషి కనిపించాల్సిన అవసరం లేదనే సినిమా డైలాగ్స్ చెప్పే సమయం కాదిది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుమ్మేస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయాలంటే కుదరదు. సాటి మనిషి కోసం ప్రజలు మానవత్వంతో స్పందించాలి. అలా ముందుకి రావాలంటే వారిని ఎవరో ఒకరు ఇన్స్ పైర్ చేయాలి. ప్రస్తుతం సోనూసూద్ చేస్తున్న పని ఇదే. కేవలం ఈయన్ని ఆదర్శంగా తీసుకునే కొన్ని వందల ఎన్జీవోలు కరోనా రోగులకు ఇప్పుడు సహాయం అందిస్తున్నాయి.
7) అన్నీ రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ వీలైనంత వరకు కష్టపడుతూనే ఉన్నాయి. రోజుకి కొన్ని లక్షల మంది కరోనా వైరస్ నుండి కోలుకుంటున్నారు. వీరిలో ఎక్కువ భాగం క్వారెంటైన్ సెంటర్స్ లో, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉండి కోలుకుంటున్న వారే. ఇలా ప్రజలను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. సోనూసూద్ చేస్తున్న సహాయం దీనికి అదనం మాత్రమే. అంత మాత్రాన సోనూసూద్ ప్రభుత్వాల కన్నా ఎక్కువ మంచి చేసేస్తున్నాడు అని కాదు. కానీ.., కొన్ని సహాయాలు ప్రభుత్వాలు చేయలేవు. ఉదాహరణకి భుజాల మీద నాగలి పెట్టుకుని పొలం దున్నుతున్న కుటుంబానికి సోనూసూద్ ట్రాక్టర్ సహాయం చేశాడు. ఈ పని ప్రభత్వం చేయదు. చేయకూడదు కూడా. ఒకవేళ చేస్తే అందరికీ ఆ ట్రాక్టర్ తీసివాల్సి వస్తుంది. సో.. ప్రభుత్వం ఒక పని చేయాలంటే అది ఉమ్మడిగా చేయాలి. దానికో కార్యాచరణ ఉండాలి. సోనుసూద్ అలా కాదు.., వన్ టూ వన్ హెల్ప్ చేస్తున్నాడు. అతనికి ఆ అవకాశం ఉంది. అందుకే అతను ప్రజల్లో, మీడియాలో హైలెట్ అయ్యాడు. అంతే తప్ప ప్రభుత్వాలు వేస్ట్, నేను తోపు అని సోనూసూద్ ఎక్కడా చెప్పలేదు. పోనీ.., సోనూ ఎప్పుడైనా అలా నోరు జారినట్టు మీరు నిరూపించగలరా?
8) సోనూసూద్ కి రాజకీయాలకి అసలు సంభంధం ఏముంది? ఆయన ఎపుడైనా ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేశాడా? క్యాంపైన్ చేశాడా? మరి అలాంటి వ్యక్తికి రాజకీయాలు ఎందుకు అంటకడుతున్నారు?
9) తమ తమ స్టార్ హీరోలని కించపరచుకోవడం ఇష్టం లేక మరికొంత మంది అభిమానులు అనవసరంగా సోనూసూద్ పై నిందలు వేస్తున్నారు. అసలు హీరోలకి, సోనూకి సంబంధం ఏమిటి? తనలా వారిని కూడా సహాయం చేయమని గాని, చేయొద్దని గాని సోనూసూద్ ఏరోజైనా కొరాడా? మరి అలాంటపుడు ఇందులో సోనూసూద్ తప్పు ఏముంటుంది. ప్రజలే ఆయన్ని రియల్ హీరోగా గుర్తించారు. సో మీ ఫ్యానిజం తీసి కాసేపు పక్కన పెట్టండి.
10) లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సోనూసూద్ గొప్పతనం తెలియాలంటే ఈరోజు నిరంతరాయంగా కొట్టుకుంటున్న కొన్ని వేల గుండె చప్పుళ్ళు వినాలి. కొన్ని వందల ఇళ్లల్లో కనిపిస్తన్న నవ్వులు చూడాలి. దేశం నలుమూలకే సాయం అందించడానికి ఆయన తీసే పరుగులు చూడాలి. నమ్ముకున్న సిద్ధాంతాన్ని బతికించుకుంటూ.., నిస్వార్ధంగా మురిసిపోతున్న ఆయన నవ్వులను ఆస్వాదించగలగాలి.
చూశారు కదా..? మరి… ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్ కి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిన సమయం ఇది. మరి మీరు కూడా కామెంట్స్ రూపంలో సోనూసూద్ కి మీ మద్దతు తెలియచేయండి.