సెకండ్ వేవ్ ఉధృతికి ఏ కరోనా వేరియంట్ కారణం? అనేది తెలుసుకునేందుకు ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమిక్ కన్సార్టియా , నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. ‘డెల్టా’ కరోనా వేరియంట్ సెకండ్‌వేవ్‌లో అత్యంత వేగంగా వ్యాపించి కొవిడ్ కేసులు భారీగా పెరగడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టా వేరియంట్ అనేది డబుల్ మ్యుటెంట్ ఉపవర్గానికి చెందినది. సెకండ్ వేవ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరగడంలో డెల్టా వేరియంట్ పాత్ర కూడా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురికి సోకిన వైరస్ రకాలపై అధ్యయనం జరపగా, డెల్టా వేరియంటే టీకా లబ్ధిదారులకు ఎక్కువగా సోకిందని గుర్తించడం గమనార్హం. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడానికి కారణమైన డెల్టా వేరియంట్ పై భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ బాగా పనిచేస్తోందని అధ్యయనంలో తేలింది.
పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ , భారత వైద్య పరిశోధన మండలి, భారత్ బయోటెక్ లు కలిసి ఈ అధ్యయనం చేశాయి. డెల్టా వేరియంట్ తో పాటు బీటా వేరియంట్ నూ సమర్థంగా ఎదుర్కొంటోందని అధ్యయనంలో తేలింది. వారాణసీలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా వందలాది మందిని బలి తీసుకుంది. ఇందుకు కారణాలను తెలుసుకోవడంపై వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సీసీఎంబీ ఉమ్మడి అధ్యయనం చేపట్టాయి. వారాణసీ చుట్టుపక్కల నుంచి ఏప్రిల్‌లో 130 జన్యు నమూనాలను సేకరించి వాటిని అధ్యయనం చేశామని అక్కడ కనీసం ఏడు వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు వెల్లడైందని సీసీఎంబీ తెలిపింది.