సాధారణ ఆశా జీవిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నట శేఖరుడిగా, నట శిఖరంగా ఎదిగిన లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ. తన సినీ ప్రస్థానంలో 5 దశాబ్దాల పాటు 350కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1997లో ఫిల్మ్ ఫేర్ సౌత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అల్లూరి సీతారామరాజు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కాయి. 2008లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. సినీ పరిశ్రమకు ఈయన చేసిన సేవలకు గాను 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. అయితే ఈ పద్మభూషణ్ అవార్డు రావడానికి ప్రధాన కారణం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డినే.
ఈ విషయాన్ని గతంలో స్వయంగా కృష్ణనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కూతురు మంజులతో ఓ చిట్ చాట్ లో భాగంగా మాట్లాడిన కృష్ణ.. తనకి పద్మభూషణ్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. “ఎప్పుడు బయటకు వచ్చినా జేబుకి ఆ మెడల్ పెట్టుకుని వస్తారు. చూడగానే ఎంత నిండుగా ఉందో” అని మంజుల అనగా.. అది పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బహుకరించిన మెడల్ అని అన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అడగ్గా.. తాను పద్మభూషణ్ గురించి ప్రయత్నించలేదని అన్నారు.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇంతకాలం అయ్యింది. మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏమిటని బాధపడ్డారని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో మాట్లాడి పద్మభూషణ్ అవార్డుల జాబితాలో తన పేరుని కూడా రాయించుకుని వచ్చారని కృష్ణ అన్నారు. అయితే జాబితాలో కృష్ణ పేరు కోసం అప్పట్లో ఢిల్లీ పెద్దలతో గొడవకి సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. అలా కృష్ణ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ ఆయన పేరు చేర్చారు. ఒక్కోసారి గుర్తించడం ఆలస్యం అవ్వచ్చేమో గానీ గుర్తించడం మాత్రం పక్కా’ అని రాజశేఖర్ రెడ్డి నిరూపించారు. ఎవరు గుర్తించినా, గుర్తించకున్నా గుర్తించే వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి చరిత్రకెక్కారు.