‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ టాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఎన్టీఆర్ ప్రశంసలను అందుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తోనే నెట్టుకు వస్తోంది. ఈ సీజన్ లో కొత్తదనం ఏమీ లేకపోయినా, ఎన్టీఆర్ తన హూందా తనంతో గట్టెక్కిస్తున్నాడనే చెప్పాలి. ఈ షో ఆరంభం ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా రావటం కూడా ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో రాజమౌళి అతిథిగా వచ్చిన ఎపిసోడ్ ఎయిర్ కాబోతోంది. ఇదిలా ఉంటే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో ఎన్టీఆర్ కంటెస్టెంట్లతో కలసి మెలసి మాట్లాడుతూ రక్తి కట్టిస్తున్నాడు. ఇటీవల ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ తనకున్న సమస్య బట్టతల గురించి వ్యాఖ్యానించగా ఎన్టీఆర్ సైతం తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమా వరకు బొద్దుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆరంభంలో తను ఊబకాయంతో ఉండటం వల్ల ప్రజలు అగ్లీ అని పిలిచారని గుర్తు చేశాడు. అదే ఇప్పుడు అభిమానుల మెప్పుదలకు కారణమయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. మొదట్లో చాలా లావుగా ఉండేవాడిని. కానీ ఏ రోజూ లావుగా ఉన్నానని నాకు అనిపించలేదు. ‘ఒకరోజు మా జక్కన్న నన్ను చూసి అసహ్యంగా ఉన్నావు అన్నారు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. మన చుట్టూ ఉన్న స్నేహితులే మనల్ని మార్గనిర్దేశం చేస్తారు. అలాంటివాళ్లే మన నిజమైన స్నేహితులు. ఆ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. మీది జుట్టు ప్రాబ్లమ్.. నాది కొవ్వు ప్రాబ్లమ్.. అంతే తేడా” అని చెప్పుకొచ్చారు.
ఏ స్టార్ హీరో కూడా తన గత జీవితాన్ని గురించి ఇంత బోల్డ్ గా చెప్పరని ఎన్టీఆర్ చేసిన పనికి అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతే కాదు కామెంట్ సెక్షన్ లో యంగ్ టైగర్ పై ప్రేమను కురిపిస్తున్నారు. పలు రకాల కామెంట్స్ తో అభిమానులు తారక్ ని అభినందిస్తున్నారు.