సినిమా హిట్ కావాలంటే స్టోరీలో దమ్ముండాలి. లేదంటే సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అయినా ఉండాలి. అప్పుడే సినిమాపై బజ్ పెరిగి కలెక్షన్స్ వస్తాయి. కానీ సోషల్ మీడియా, ఓటీటీ వాడకం పెరిగిన ఈ రోజుల్లో బాయ్ కాట్ ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న చిన్నరీజన్స్ కే.. బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ అంటే ఏంటి? దీని వల్ల సినిమా ఫలితాలు తారుమారు అవుతాయా? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇది సోషల్ మీడియా యుగం. మూవీ పోస్టర్ రిలీజైతే చాలు.. స్టోరీని ఇట్టే పసిగట్టేస్తున్నారు. అదీ కాక మూవీ కథ ఇదేనని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చాలాసార్లు ఇది నిజమైపోతుంది కూడా. అదీ కాక మరోవైపు ఓటీటీల డామినేషన్ కూడా పెరిగిపోయింది. రిలీజైన వారాల్లోనే.. సినిమాలు ఫోన్లు, టీవీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఇండస్ట్రీ చాలా కష్టాలు పడుతోంది. దీనికి తోడు బాయ్ కాట్ ట్రెండ్ కూడా పెరిగిపోతోంది.
ప్రస్తుతం ఈ ట్రెండ్ హిందీ సినిమాల వరకే ఉన్నప్పటికీ.. త్వరలో సౌత్ లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంకా దీని గురించి క్లియర్ గా చెప్పాలంటే.. ఓ హీరో గతంలో ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేసుంటాడు. అది జరిగిన కొన్నేళ్లు అయిపోయి ఉండొచ్చు. అందరూ దాని గురించి మర్చిపోయి కూడా ఉండొచ్చు. కానీ ఆ హీరో కొత్త సినిమా రిలీజ్ కి రెడీ అయితే చాలు.. ఆ హీరోనే విమర్శించే వాళ్లందరూ ఒక్కటైపోతున్నారు. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ట్విట్టర్ లో బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఆమిర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’నే తీసుకోండి. సినిమా బాగా తీశారు, అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది చూసిన తర్వాత ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ దానికంటే ముందే.. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. దీంతో ప్రేక్షకులు సినిమా రిలీజ్ కి ముందే ఓ అంచనాకు వచ్చేశారు. అలా వచ్చేలా సోషల్ మీడియా యూజర్స్ చేశారు. దీనికి తోడు సినిమా స్క్రీన్ ప్లే కూడా కాస్త నెమ్మదిగా ఉండటం లాల్ సింగ్ చడ్డా సినిమాకు మైనస్ అయింది. ఫైనల్ గా ఆమిర్ సినిమాకు ఎప్పుడు లేనంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ ట్రెండ్ లిస్ట్ లోకి త్వరలో రిలీజయ్యే.. లైగర్, బ్రహ్మాస్త్ర సినిమాలు కూడా చేరిపోయాయి. ఈ విషయమై ఇప్పటికే ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ.. ”మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు.. మన ధర్మం మనం చేసినప్పుడు.. ఎవరీ మాట వినేదిలేదు.. కోట్లాడుదాం” అని ట్వీట్ చేశాడు. ఇక బ్రహ్మాస్త్ర విషయంలోనూ స్పందించిన హీరోయిన్ ఆలియా భట్.. ”నచ్చితే చూడండి.. నచ్చకపోతే చూడటం మానేయండి” అని స్టేట్ మెంట్ ఇచ్చింది.
మరోవైపు లైగర్ మూవీకి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. అందువల్లే పలువురు సోషల్ మీడియా యూజర్స్.. బాయ్ కాట్ లైగర్ అని ట్రెండ్ చేస్తున్నారు. సెప్టెంబరు 9న రిలీజ్ కావాల్సిన బ్రహ్మాస్త్ర చిత్రంలో రణ్ బీర్-ఆలియా భట్.. హీరోహీరోయిన్స్. దీంతో నెపోటిజమ్ అనే దానిపై విరక్తి చెందిన పలువురు బాలీవుడ్ ఆడియెన్స్.. విడుదలకు కొన్నిరోజుల ముందు నుంచే బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆడియెన్స్ కి.. చిత్రానికి వెళ్లాలని ఉన్నాసరే మానసికంగా ఆ సినిమాపై వస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ చూసి వెళ్లడం మానుకుంటారు. ఈ కారణం వల్లే ఈ ఏడాది బాలీవుడ్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఫ్లాప్స్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే సినీ ప్రేక్షకుల నుంచి మరో వాదన వినిపిస్తోంది. కేవలం బాయ్ కాట్ ట్రెండ్ అనే పదం వల్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడతాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా కథలో దమ్ముండాలి లేదా తీసే విధానంలో కొత్త దనాన్ని ప్రేక్షకులకు కలిగించాలి. అంతే గానీ బాయ్ కాట్ ట్రెండ్ వల్లే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి అనడం హాస్యాస్పదం. మరి హీరో అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ కు ఏ బాయ్ కాట్ సెగ తగిలి డిజాస్టర్ అయ్యిందని అంటున్నారు. అదే విక్రమ్, RRR,కేజీఎఫ్ 2 లాంటి సినిమాలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలితే హిట్ అయ్యేవి కావా? కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు.. కథ ఉన్నోడిని బాయ్ కాట్ బచ్చాగాళ్లు ఆపలేరు అంటూ కొందరు నెటిజన్స్ అంటున్నారు.
ప్రస్తుతం.. సౌత్ సినిమాల్లో కంటెంట్ పెరగడం.. మనకు పాన్ ఇండియా వైడ్ ప్లస్ అవుతుంటే.. రొటీన్ కథలతో బాలీవుడ్ లో సినిమాలు వస్తుండటం వాళ్లకు మైనస్ అవుతోంది. దీనికి తోడు బాయ్ కాట్ అనే పదం వల్ల ఆడియెన్స్ కూడా హిందీ సినిమాలు చూడటం మానేసి.. దక్షిణాది సినిమాల వెంటపడుతున్నారు. మరి ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.