నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదు. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. మొగల్తూరు నుండి మెగాస్టార్ వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఒక లెజెండ్. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సోలోగా, స్వయంకృషితో పైకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి చిరు రాజకీయాల్లోకి వెళ్తున్నారనగానే ఆయన్ని తొక్కే ప్రయత్నం చేశారు కొంతమంది. అదే పనిగా విష ప్రచారం చేసి ఎంత డ్యామేజ్ చేయాలనుకున్నారో అంతా చేసి లబ్ది పొందారు.
ముఖ్యంగా చిరంజీవి మొగల్తూరులో గ్రంథాలయం కోసం ఇల్లు అడిగితే ఇవ్వలేదు అని, పైగా దాన్ని రూ. 3 లక్షలకు అమ్ముకున్నారని అప్పట్లో బాగా చిరుని అవమానించే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ చిరుని తిట్టుకునేవారు ఉన్నారు. మొన్నా మధ్య కృష్ణంరాజు గారి దిన కర్మ రోజున మొగల్తూరులో లక్ష మందికి దాకా మంచి భోజనం పెట్టించారన్న వార్త అప్పట్లో వైరల్ అయ్యింది. అదే సమయంలో ఒక వ్యక్తి చిరుపై కామెంట్స్ చేశాడు. ‘ప్రభాస్ మనకి ఇంత గ్రాండ్ గా భోజనం పెట్టాడు, చిరంజీవి ఏం చేయలేదు. ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాడు. లైబ్రరీ కోసం అడిగితే ఇవ్వలేదు’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇతనొక్కడే కాదు, ఇలా చాలా మంది ఈ విషయంలో చిరంజీవిని విమర్శిస్తున్నారు.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. చిరంజీవి దీని మీద స్పందించకపోవడంతో అదే నిజమనే భ్రమలో ఉన్నారు చాలా మంది. అభిమానులు మాత్రం నిజం కాదని నమ్ముతారు. కానీ నిజమా? కాదా? అనే సందేహంలో చాలా మంది ఉన్నారు. నిజం అనే భ్రమలో ఉన్న వారికి, నిజమా? కాదా? అన్న సందేహంలో ఉన్న వారికి ఇవాళ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు జర్నలిస్ట్ ప్రభు. అసలు కోటీశ్వరుడు అయిన చిరంజీవికి ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎన్నో దానాలు, గుప్తదానాలు చేసిన వ్యక్తి లైబ్రరీ కోసం ఇల్లు ఇవ్వలేరా? ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎందుకు ఆయన మీద ఇంత వ్యతిరేక ప్రచారం చేశారు అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే అని జర్నలిస్ట్ ప్రభు వెల్లడించారు.
2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సమయంలో చిరంజీవి మీద, ప్రజారాజ్యం పార్టీ మీద బురద జల్లుడు ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నారని, ఈ విషయంలో కొంతమంది బాగా సక్సెస్ అయ్యారని ఆయన అన్నారు. మొగల్తూరులో గ్రంథాలయం కోసం చిరంజీవిని ఇల్లు అడగడం, చిరంజీవి ఇల్లు ఇవ్వను అని అనడం, రూ. 3 లక్షలకు ఇల్లు అమ్మేయమని అనడం.. ఇవేమీ నిజాలు కాదని ఆయన అన్నారు. అసలు మొగల్తూరులో చిరంజీవికి ఇల్లే లేదని అన్నారు. ‘మరి ఆ ఇల్లు ఎవరిది? చిరంజీవిది కాక ఇంకెవరిది? ఆహా ఇలాంటివి మేము నమ్మము. చిరంజీవి లైబ్రరీ కోసం అడిగితే ఇవ్వకుండా రూ. 3 లక్షల కోసం ఇల్లు అమ్మేశాడు. ఇదే మేము నమ్ముతాం’ అనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ వీడియోనే సమాధానం. ఈ వీడియోని చిరంజీవి అభిమాని అయిన ప్రతీ ఒక్కరూ చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి.